పల్లెలో పండగ సంబరాల్లోనూ పాలనపై దృష్టే!
Publish Date:Jan 12, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన సొంత గ్రామం నారావారి పల్లెకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన నాలుగు రోజుల పాటు స్వగ్రామంలోనే ఉంటారు. పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది. అందుకే వారు పండుగకు సొంత ఊరు వెళ్లే సమయంలో కూడా సూర్యలంక బీచ్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సూర్యలంక బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిధులతో చేపట్టిన షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులను సంక్రాంతి పండుగకు తన సొంత గ్రామం వెళ్లడానికి ముందు తన కుమారుడు, మంత్రి లోకేష్ తో కలిసి ఏరియల్ వ్యూ చేశారు. తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నారా వారి పల్లెకు వెడుతూ వారు సూర్యలంక బీచ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అక్కడికక్కడే అధికారులనుంచి వివరాలు అడిగి తెలుసుకుని దిశానిర్దేశం చేశారు. ఇక పండుగ సందర్భంగా సొంత ఊరు నారావారి పల్లెలోనే చంద్రబాబు బస చేయనున్నారు. సోమవారం (జనవరి 11) నారావారి పల్లె చేరుకున్న చంద్రబాబు మంగళవారం (జనవరి 12) గ్రామంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లారు. రూ.70 లక్షలతో ఎ-రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభించారు. ఆ తరువాత కూడా ఆయన కనుమ పండుగ రోజు వరకూ పండుగ సంబరాలతో పాటు పాలనా వ్యవహారాలను కూడా నారావారి పల్లె నుంచే సాగిస్తారు. ఇక నారావారి పల్లెలో నారా వారి కుటుంబ సంక్రాంతి సంబరాలలో నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా పాల్గొననుంది.
http://www.teluguone.com/news/content/cbn-concentration-on-administration-and-developement-25-212432.html




