12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు.. నాగలి పట్టిన జేడీ లక్ష్మినారాయణ
Publish Date:Jun 24, 2021
Advertisement
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సరికొత్త జీవితం ప్రారంభించారు. సీబీఐకి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసిన లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన మరొ కొత్త రంగాన్ని ఎంచుకున్ని తొలి అడుగు వేశారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా.. నాగలి పట్టి రైతుగా మారారు. ఎడ్ల నాగలితో దుక్కి దున్ని వ్యవసాయ పనులు మొదలు పెట్టారు లక్ష్మినారాయణ. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు లక్ష్మీనారాయణ. ఏరువాక పౌర్ణమి కావడంతో గురువారం వ్యవసాయ పనులను ప్రారంభించారు. నాగలి పట్టి ఉత్సాహంగా పొలం దున్నారు సీబీఐ మాజీ జేడీ. ఎన్నో క్లిష్టతరమైన కేసులను ఛేదించిన లక్ష్మినారాయణ.. సాగు పనులను కూడా ఈజీగానే చేసేస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభించిన సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. కరోనా కాలంలో మన దేశంలో వ్యవసాయ రంగం మాత్రమే ముందుకు వెళ్లగలిగిందని చెప్పారు. గత ఏడాది దేశ వ్యవసాయరంగంలో 3.6 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. రైతన్నల వల్లే దేశంలో గోడౌన్లు ఆహార ధాన్యాలతో నిండిపోయాయని లక్ష్మినారాయణ చెప్పారు. తాను వ్యయం చేస్తూ సాయం చేసేవాడు వ్యవసాయదారుడు అని అన్నదాతలను కీర్తించారు. వ్యవసాయంలో ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నానని చెప్పారు. తన అనుభవం ద్వారా వ్యవసాయంలో రావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తానని తెలిపారు, పురుగుల మందులు చల్లడంలో డ్రోన్ల టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి రావాలని లక్ష్మీనారాయణ అభిలషించారు.
http://www.teluguone.com/news/content/cbi-ex-jd-laxminarayana-started-agri-works-on-eruvaka-25-118290.html





