రూ.2 కోట్లు లంచం తీసుకుంటూ దొరికిన ఆర్మీ అధికారి
Publish Date:Dec 21, 2025
Advertisement
లంచం తీసుకున్న కేసులో భారతీయ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మతో పాటు ప్రైవేట్ వ్యక్తి వినోద్ కుమార్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారంతో డిసెంబర్ 19న ఈ కేసును నమోదు చేసిన సీబీఐ, లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ (డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ – ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ), ఆయన భార్య కల్నల్ కాజల్ బాలి (కమాండింగ్ ఆఫీసర్, 16 ఇన్ఫాంట్రీ డివిజన్ ఆర్డినెన్స్ యూనిట్, శ్రీగంగానగర్, రాజస్థాన్)తో పాటు దుబాయ్‌కు చెందిన ఓ కంపెనీతో సహా మరికొందరిపై క్రిమినల్ కుట్ర, లంచం ఆరోపణలతో కేసు నమోదు చేసింది. సీబీఐ విచారణ ప్రకారం... లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ రక్షణ ఉత్పత్తుల తయారీ, ఎగుమతులు నిర్వహించే పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులతో కుమ్మక్కై, వారికి అనుచిత లాభాలు చేకూర్చినందుకు ప్రతిఫలం గా లంచాలు స్వీకరిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అదే విధంగా, రాజీవ్ యాదవ్ మరియు రవ్జిత్ సింగ్ అనే వ్యక్తులు ఆ కంపెనీకి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ బెంగళూరులో స్థిరపడి, లెఫ్టినెంట్ కల్నల్ శర్మతో తరచుగా సంప్రదింపులు కొనసాగిస్తూ పలు ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల నుంచి అక్రమ మార్గాల్లో లాభాలు పొందేందుకు ప్రయత్నించినట్లు సీబీఐ తెలిపింది. ఈ క్రమంలో డిసెంబర్ 18న వినోద్ కుమార్ అనే వ్యక్తి, కంపెనీ ఆదేశాల మేరకు లెఫ్టినెంట్ కల్నల్ శర్మకు రూ.3 లక్షల లంచం అందజేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో భాగంగా శ్రీగంగానగర్, బెంగళూరు, జమ్మూ తదితర ప్రాంతాల్లో సీబీఐ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ నివాసంలో జరిగిన సోదాల్లో రూ.3 లక్షల లంచం... అదనంగా రూ.2,23,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీగంగానగర్‌లోని ఆయన ఇంట్లో రూ.10 లక్షల నగదు సహా కీలక ఆధారాలు లభ్యమైనట్లు సీబీఐ వెల్లడించింది. న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయ ప్రాంగణంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అరెస్టైన లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ, వినోద్ కుమార్‌లను కోర్టులో హాజరుపరిచిన అధికారులు, డిసెంబర్ 23 వరకు పోలీస్ కస్టడీకి అనుమతి పొందారు. ఈ కేసుపై మరింత విచారణ కొనసాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది.
http://www.teluguone.com/news/content/cbi-36-211365.html





