స్వార్థ రాజకీయం కోసం.. ఏపీలో మళ్లీ కులాల కుంపటి.. జనం నమ్మరు!
Publish Date:Jun 19, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం అనేది ఎప్పుడూ ఒక కీలకమైన అంశమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రాజకీయ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల మధ్య మళ్లీ చిచ్చు పెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నాయి. సమాజంలో ఒక శాతం కూడా లేని కుల వివక్షను రాజకీయం కోసం పెద్దదిగా చూపించి, ప్రజల మధ్య వైషమ్యాలు రగల్చాలని చూస్తున్న నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఏపీని ఏ దిశగా తీసుకెళ్తున్నాయనే చర్చకు దారితీస్తున్నాయి. దీనిపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున తెలుగున్ కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు. ఈ తరహా కుల విభజన రాజకీయాల వల్లే గతంలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయిందని గుర్తు చేశారు. గతంలో రాజీవ్ గాంధీ మరణం సమయంలో గానీ, వంగవీటి మోహన రంగా హత్య జరిగినప్పుడు గానీ జరిగిన హింసాత్మక ఘటనలకు సామాజిక వర్గాలతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. ఆయా సందర్భాలను వాడుకుని కొన్ని ముఠాలు ఆస్తులను ధ్వంసం చేసి కుల ముద్ర వేశాయన్న కిలారు.. ఇప్పుడు కూడా నేరం చేసినప్పుడు వ్యక్తిగత విషయంగా చూసే నాయకులు.. చట్టం తమపై చర్యలు తీసుకునేటప్పుడు మాత్రం కులం కార్డు బయటకు తీస్తున్నారని ఆక్షేపించారు. దళితులు, బీసీలు, ఇతర వర్గాల పేరుతో సానుభూతి పొందేందుకు ప్రయత్నించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో వైసీపీ తాను నిర్వహించే ఏ నిరసన కార్యక్రమానికీ, ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో మళ్లీ కుల సమీకరణల అస్త్రాన్ని నమ్ముకుందన్నారు. కాపు సామాజిక వర్గాన్ని కూటమికి దూరం చేసేలా కొందరు నాయకులకు ప్రత్యేక టాస్క్‌లు అప్పగించారనే ప్రచారం కూడా సాగుతోందన్నారు. వీరికి తోడు తెలంగాణకు చెందిన కొందరు మేధావులు, ప్రొఫెసర్లు న్యూట్రల్స్ ముసుగులో ఏపీలో కుల రాజకీయాలను మరింత ప్రోత్సహిస్తూ ఒక వైపునకే వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే.. ఏపీ ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతంగా ఉన్నారని, 2019 నాటి కులాల ట్రాప్‌లో పడే పరిస్థితి ఇప్పుడు లేదని స్పష్టం చేశారు. నేటి సమాజంలో కులాంతర వివాహాలు పెరుగుతూ, ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్న తరుణంలో రాజకీయాల కోసం కుంపట్లు పెడితే ఎవరూ నమ్మరని తేల్చిచెప్పారు. ప్రజలకు ఇప్పుడు కావాల్సింది అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, ఉద్యోగ అవకాశాలు మాత్రమేనని.. కాబట్టి రాజకీయ పార్టీల కుయుక్తులను విచక్షణతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/caste-tensions-stoked-again-in-ap-25-223542.html





