ఫ్యాన్స్ కు పవన్ కళ్లెం వేయగలరా ?
Publish Date:Jan 27, 2025
Advertisement
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సినీ నేపథ్యం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన తిరుగులేని హీరో. అశేష ప్రేక్షకాభిమానం ఆయన సొంతం. జనసేన క్యాడర్ లో అత్యధికులు కూడా సినీ అభిమానులగా మొదలై.. జనసైనికులుగా మారిన వారే. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఎదురౌతున్న అతి పెద్ద సమస్య ఏమిటంటే.. అత్యధిక జనసైనికులకు పొలిటికల్ కంపల్షన్ విషయంలో పట్టింపు ఉందడు. అలాగే పొత్త ధర్మం గురించి ఆలోచించి, అర్ధం చేసుకునేంత రాజకీయ పరిజ్ణానం కూడా ఉండదు. వారికి ఉన్నది పవన్ కల్యాణ్ పై హద్దులు లేని, అవధులు లేని అభిమానం మాత్రమే. వారి ఈ వైఖరే పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఒకింత ఇబ్బందికరంగా మారింది. అప్పటికీ పలు సందర్భాలలో పార్టీ క్యాడర్ ను ముఖ్యంగా అభిమానులను నియంత్రించడానికి ఆయన ప్రయత్నించారు. ఒక్కోసారి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సినీమా వేరు, రాజకీయం వేరు అని నిష్కర్షగా, నిర్మొహమాటంగా ఒకింత ఘాటు స్వరంతోనే చెప్పారు. అయితే తరచూ జనసైనికుల వైఖరి పొత్తు ధర్మానికి భిన్నంగా ఉంటూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు కొన్ని గైడ్ లైన్స్ విధించారు. జనసేన స్వతంత్రంగా వ్యవహరించే పార్టీ అయినా తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు ఉన్నందున పొత్తు ధర్మాన్ని పాటించి తీరాలని ఆయన గట్టిగా చెప్పారు. ఈ మేరకు పార్టీ క్యాడర్ కు డూస్ అండ్ డోంట్స్ ను స్పష్టంగా వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన జనసైనికులనే కాకుండా, తెలుగుదేశం, బీజేపీ క్యాడర్ కు కూడా కనువిప్పు కలిగే లా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ కల్యాణ్ తన పార్టీ క్యాడర్ ను ఉద్దేశిస్తూ జారీ చేసిన మార్గదర్శకాల్లో గత ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని మరోసారి పూసగుచ్చినట్లు వివరించారు. జగన్ ను నియంత్రించి తీరాల్సిన అనివార్య పరిస్థితుల్లోనే జనసేన పార్టీ చొరవ తీసుకుని తెలుగుదేశం, బీజేపీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు కారణమైందని వివరించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, క్యాడర్ కూడా కొన్ని త్యాగాలు చేశాయని అంగీకరించారు. అలా చేయడం వల్లనే జనసేన గత ఏడాది జరిగిన ఎన్నికలలో హండ్రడ్ పర్సంట్ రిజల్డ్ సాధించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే జనసైనికులు సంయమనంతో వ్యవహరించాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక ఇప్పుడు జనసైనికులకు ఆయన జారీ చేసిన మార్గదర్శకాల విషయానికి వస్తే... 1. అనవసర విభేదాలు, వివాదాలకు దూరంగా ఉండాలి. 2జ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై స్పందించ కూడదు. 3. కూటమి అంతర్గత విషయాలు, వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడకూడదు. వెరసి కూటమి పటిష్టతకు హానీ చేసే ఏ ఒక్క విషయంపై అసలు స్పందించవద్దని ఆయన పార్టీ శ్రుేణులను కోరారు. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ కట్టుబాట్లకు కట్టుబడాల్సిందేనని కూడా పవన్ పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. జనసేనాని ఇప్పుడు తన క్యాడర్ కు విధించిన మార్గదర్శక సూత్రాలు కొత్తవేమీ కాదు. గతంలో ఆయనే స్వయంగా ఈ విషయాలను ప్రస్తావిస్తూ తన క్యాడర్ కు అభిమానులను పలు సందర్భాలలో హెచ్చరించారు. కానీ ఫలితం పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు తాజాగా ఆయన మళ్లీ పార్టీ క్యాడర్ కు మార్గదర్శకాలు జారీ చేశారు. పొలిటికల్ గా ఆయన చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యం. అయితే రాజకీయ అవసరాలు, ఒత్తిళ్ల గురించి పవన్ కల్యాణ్ అభిమానులు పెద్దగా పట్టించుకోరు. వారి ఏకైక ఆకాంక్ష పవన్ కూటమిలోనైనా, ప్రభుత్వంలోనైనా నంబర్ వన్ గా ఉండాలన్నదే. ఇదే విషయాన్ని పలు సందర్భాలలో వారు ఆర్భాటంగా చాటారు. ఆయన సభలలో సీఎం నినాదాలు, తెలుగుదేశం పార్టీలో, లేదా కూటమి ప్రభుత్వంలో లోకేష్ కు ప్రమోషన్ అన్న వార్తలకు వారు అతిగా స్పందించడంలాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో జనసేనాని మార్గదర్శకాలను జనసైనికులు పాటిస్తారా? వారిని పవన్ కల్యాణ్ కంట్రోల్ చేయగలరా? అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/can-pawan-control-fans-39-191899.html





