కాగ్ పై కూడా రాజకీయ ఒత్తిళ్ళు?
Publish Date:Aug 24, 2014
Advertisement
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ చాలలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. కానీ ఆ కారణంగా ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీని అవినీతి భూతం ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంది. అయితే ఈ విమర్శలన్నీ ప్రతిపక్షాలు కాక, కాంగ్రెస్ పార్టీకే చెందినవారు, యూపీయే ప్రభుత్వంలో ఉన్నత పదవులు నిర్వహించినవారు చేయడంతో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఉదారణకు యూపీయే హయాంలో బొగ్గుశాఖ మాజీ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన పీ.సి.ఫారెక్ కోల్ గేట్ (బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం)లో మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ప్రేక్షక పాత్ర వహించడం ద్వారా అవినీతికి ఆమోదం తెలిపారని విమర్శించారు. డా. మన్మోహన్ సింగుకి మీడియా సలహాదారుగా సంజయ్ బారు, మాజీ కాంగ్రెస్ నేత నట్వర్ సింగ్ ఇరువురు కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు. కొద్ది రోజుల క్రితం ప్రెస్ ట్రస్ట్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ మన సుప్రీం న్యాయ వ్యవస్థకూడా రాజకీయ ఒత్తిళ్లకు కొంగి, అవినీతిపరులకు పదవులు, పదోన్నతులు కల్పించిందని ఆరోపించారు. అప్పుడు కేంద్రప్రభుత్వం మేల్కొని సుప్రీం కోర్టు కోలీజియం వ్యవస్థను పునర్ వ్యవస్థీకరణ చేసారు. ఇప్పుడు కొత్తగా యూపీయే హయంలో కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ గా పనిచేసిన వినోద్ రాయ్ కూడా కోల్ గేట్ మరియు కామన్ వెల్త్ గేమ్స్ స్కాముల నుండి కొందరు కాంగ్రెస్ నేతల పేర్లను తొలగించమని కోరేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు తనపై ఒత్తిడి చేసారని ఆయన తెలిపారు. తను వ్రాసిన ‘నాట్ జస్ట్ యాన్ అకౌంట్’ అనే పుస్తకం వచ్చేనెల 15న మార్కెట్ లోకి విడుదల కానుందని ఆయన తెలిపారు. అందులో ఆయన తన అనుభవాలను, కాంగ్రెస్ పార్టీ పాల్పడిన అవక తవకల గురించి వివరించినట్లు సమాచారం. అందువల్ల ఆ పుస్తకం విడుదలయినట్లయితే ఇటువంటివే మరిన్ని అవినీతి భాగోతాలు బయటపడే అవకాశం ఉంది. అదేజరిగినట్లయితే ఇప్పటికే తీవ్ర అప్రతిష్టపాలయిన కాంగ్రెస్ పార్టీ పరువు పూర్తిగా గంగలో కలిసిపోవడం ఖాయం. అయితే కాంగ్రెస్ పార్టీ పరువుపోతే దానిని మళ్ళీ ఏదో విధంగా ఎప్పుడో అప్పుడు సంపాదించుకోవచ్చును. కానీ అధికారం చేతిలో ఉంది కదా అని విలువయిన దేశ సంపదను కొందరు నేతలకు, పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా దోచిపెట్టినందుకు ఎటువంటి శిక్ష పడకపోవడం, కనీసం వారి నుండి నష్టపరిహారం వసూలుచేయకపోవడం చూస్తే, ఎన్ని తప్పులు చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా కూడా అవినీతికి పాల్పడినవారు ఎన్నికలలో ఓడిపోయినట్లయితే అన్ని తప్పులు క్షమించబడిపోతాయన్నట్లుంది.
http://www.teluguone.com/news/content/cag-45-37555.html





