హైదరాబాదుపై క్యాబినెట్ చర్చ, నిర్ణయం?
Publish Date:Oct 1, 2013
Advertisement
మొన్న హైదరాబాదులో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ తనతో కాంగ్రెస్ అధిష్టానం పూర్తి ‘టచ్చు’లోనే ఉందని అక్టోబరు ఆరులోగా అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్లగ్గు పీకేయబోతున్నదని ప్రకటించారు. ప్లగ్గు పీకడం సంగతి ఎలా ఉన్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ తో బాటు బీజేపీ అధిష్టానంతో కూడా పూర్తి టచ్చులోనే ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన సజావుగా జరగాలంటే హైదరాబాదుపై కొంత పట్టువిడుపులు తప్పవని కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ మరియు టీ-కాంగ్రెస్ నేతలకి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విభజనకు అంగీకరిస్తేనే హైదరాబాదుపై సీమాంద్రా నేతల డిమాండ్లను కొన్నిటినయినా నేరవేర్చగలమని వారికి నచ్చచెపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ అధిష్టానాన్నికూడా సంప్రదిస్తూ దానిపై వారి సలహా, సూచనలు తీసుకొంటునట్లు తెలుస్తోంది. తద్వారా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ ఆలోచన. కొద్ది రోజుల క్రితం వరకు ‘సమన్యాయం’ అని మాట్లాడిన బీజేపీ అందుకే తన వైఖరి మార్చుకొని ఉంటుంది. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మెహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తమ పార్టీ పార్లమెంటులో తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తుందని ప్రకటించడమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చును. రేపు జరుగబోయే క్యాబినెట్ సమావేశంలో హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టబోయే టీ-బిల్లులో ఈ ప్రతిపాదనలు ఉండవచ్చునని తాజా సమాచారం. 1. గ్రేటర్ హైదరాబాదు మొత్తం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. 2. విద్య, వైద్యం, ఉద్యోగాలు, లా అండ్ ఆర్డర్, భూశిస్తు, మరియు ఇతర ఆదాయ వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. 3. ప్రస్తుతం హైదరాబద్, సైబరాబాద్ రెండు పోలీస్ కమీషనరేట్లను గ్రేటర్ హైదరాబాదు పరిధిలోకి తీసుకు వస్తారు. 4. ముందు ప్రకటించినట్లుగానే హైదరాబాద్ తెలంగాణా లో అంతర్భాగంగా, తెలంగాణా రాజధానిగా ఉంటుంది. అదే సమయంలో మరో పది సంవత్సరాల వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు సీమాంధ్ర, టీ-నేతలు అంగీకరించినట్లయితే వెంటనే విభజన ప్రక్రియ మొదలవుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజదానిని ఎక్కడ నిర్మించాలనే విషయంపై సీమంద్రా నేతలతో సంప్రదింపులు మొదలవుతాయి.
http://www.teluguone.com/news/content/cabinet-meeting-39-26283.html





