పులివెందులకు ఉప ఎన్నిక.. తెలుగుదేశం అభ్యర్థి రెడీ?
Publish Date:Sep 8, 2025
Advertisement
ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. అక్రమాలకు పాల్పడ్డారు, అధికార దుర్వినియోగం జరిగింది.. అంటే వైసీపీ ఎంతగా బుకాయించినా.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఆ పార్టీ పరాజయాన్ని జీర్ణించుకోవడం ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ అధినేత జగన్ కు కానీ ఇప్పట్లో సాధ్యం కాదన్నది వాస్తవం. అయితే ఆ పరాజయం స్వయంకృతాపరాధమేనని కూడా చెప్పక తప్పదు. గత ఏడాది జరిగగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ లో రాజకీయ శూన్యత నెలకొన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవకాశం లేని, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ జగన్ అసెంబ్లీకి గైర్హాజరు అవ్వడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. జగన్ అసెంబ్లీకి హాజరై సామాన్య ఎమ్మెల్యేగా కూర్చోవలసి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అవకాశం లేదని తెలిసీ ఆయన విపక్ష హోదా పేరు చెప్పి అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి దూరంగా ఉంచుతున్నారు. ప్రజలు జగన్ ను పులివెందుల నియోజకవవర్గానికి తమ ప్రతినిథిగా ఓట్లేసి గెలిపించారు. రాజ్యాంగం ప్రకారం ఆయన అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను లేవనెత్తడం ఆయన విధి. బాధ్యత. అయితే వ్యక్తిగత అహం, ఆభిజాత్యంతో జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. అయితే పైకి మాత్రం ప్రతిపక్ష హోదా అంటూ.. ప్రభుత్వం ఆ హోదా తనకు ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పిస్తూ ప్రజల సానుభూతి పొందాలని ప్రాకులా డుతున్నారు. సంఖ్యాబలం లేకుండా, హోదా లేకుండా సభకు వెడితే పరాభవంఎదురౌతుందన్న భయంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు. అంతే కానీ..వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే సభకు హాజరై తనను ఎన్నుకున్న ప్రజల తరఫున గొంతు వినిపించాల్సిన కనీస బాధ్యతను విస్మరిస్తున్నారు. ఈ తీరు కారణంగానే ఆయన సొంత నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం రుజువుచేసింది. వాస్తవానికి జగన్ అసెంబ్లీ గైర్హాజర్ నిర్ణయం ఆయన అవకాశవాదాన్నీ, బాధ్యతను స్వీకరించలేని దుర్బలత్వానికీ నిదర్శనంగా నిలుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉప ఎన్నికల భయం వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలను వణికించేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ భయం వణుకుతోనే, ఆ డిస్పరేషన్ తోనే వైసీపీ నేతలు గతంలో చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేయలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన నాడు అసెంబ్లీ బహిష్కరణ ప్రకటన చేసిన సందర్భం, సమయం పూర్తిగా వేరు. అయితే ఇప్పుడు జగన్, ఆయన పార్టీ సభ్యుల బహిష్కరణకు ఒక కారణం, ఒక విధానం, ఒక ప్రాతిపదిక అంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా నిరాశ, నిస్ఫృహ మాత్రమే. విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజర్ ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ సారి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే వారిపై అనర్హత వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే పులివెందులకు సపోజ్ ఫర్ సపోజ్ ఉప ఎన్నిక వస్తే తెలుగుదేశం అభ్యర్థిని రెడీ చేసేసిందంటున్నారు. . అంటే వైసీపీ బాధ్యతల నుంచి పారిపోయి దాక్కోవాలని ప్రయత్నిస్తుంటే.. తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమౌతోందని అవగతమౌతోంది.
http://www.teluguone.com/news/content/by-poll-to-pulivendula-assembly-constitutiency-39-205787.html





