బుల్లెట్ బాబా..!
Publish Date:Jul 14, 2022
Advertisement
దేశంలో భక్తి పారవశ్యానికి తక్కువేమీలేదు. ప్రతీదీ మతం, భక్తితో ముడిపెట్టేయడం అనాదిగా దేశంలో వస్తున్నదే. పిల్లాడికి బాగోలేకపోయినా, పిల్లదానికి పెళ్లికాబోయినా, కాలేజీ సీటు, విదేశాలకు వీసా రాక పోయినా కూడా దేవుడిమీదే భారం వేయడం బాగా అలవాటయిపోయింది. అందుకే దేశంలో బాబాల హడావుడి ఎక్కువైపోయింది. అయితే ఈ బుల్లెట్ బాబా సంగతి వేరు. దేశంలోని అనేక దేవాలయాల్లో ఈ బులెట్ బాబా గుడి ఒకటి. ఇది రాజస్థాన్ జోధ్‌పూర్‌లో వుంది. దీని చుట్టూ కూడా భక్తగణం తెగ తిరుగు తూంటారు. ఇంతకీ బులెట్ బాబా గుడి అనగానే అక్కడ ఏ సాయిబాబా విగ్రహమో వుంటుందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ అలాంటిదేమీ లేదు. చిత్రంగా ఒక 350 సిసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్ వుంది. దీన్ని పూజించడానికి జోధ్‌పూర్ జనాలే కాదు చాలా దూర ప్రాంతాల నుంచీ కూడా భక్తులు క్యూ కడుతున్నారు. ఈ జోధ్‌పూర్ గుడిని చాలాకాలం నుంచి ఇక్కడివారంతా బులెట్ బాబా గుడి అనే పిలుస్తున్నారు. కానీ దీని అసలు పేరు ఓం బన్నా ధామ్. ఇంత చక్కటి పేరుండగా బులెట్ పేరు ఎందుకు పెట్టారని చాలామంది చాలారోజులు తెగ ఆలోచించారు. దీనికి ఒక ఆసక్తికర కథ వుంది. ఈ గుడి జోధ్‌పూర్ నుంచి 50 కి.మీ దూరంలోని పాలి పట్టణం సమీపంలోని చోటిలా గ్రామంలో వున్నది. 1988 డిసెంబర్ 2న ఓమ్ బన్నా అనే పెద్దాయన సందీరా సమీపంలోని బాంగ్దీ నుంచి ఈ గ్రామానికి బయలుదేరారు. ప్రయాణంలో ఆయన అదుపు తప్పి ఒక చెట్టుకి గుద్దుకోవడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి కొంత దూరంలో గుండలో పడింది. మర్నాడు ఉదయం పోలీసులు ఆ మోటార్‌సైకిల్‌ను దగ్గరున్న పోలీసు స్టేషన్‌కు తీసికెళ్లారు. చిత్రంగా మర్నాడు ఆ బండి స్టేషన్‌లోంచి మాయమైంది. పోలీసు స్టేషన్ నుంచి ఎవరు దొంగిలించారబ్బా అనుకు న్నారు పోలీసులు. తీరా చూస్తే సరిగ్గా ఆ ప్రమాదం జరిగిన చోటనే మళ్లీ దొరికింది! పోలీసులకు, అక్కడి జనానికి ఆశ్చర్యమేసింది. ఇదెలా సాధ్యమని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. పోలీసులు మళ్లీ దాన్ని స్టేషన్‌కు తీసికెళ్లారు. అయితే ఈ సారి గొలుసులతో కట్టేసారు. చిత్రమేమంటే మర్నాడు ఉదయంచూస్తే మళ్లీ బండి గాయబ్! ఇలా మాయం కావడంతో ఆ బండికి బులెట్ బాబా అని పేరు వచ్చింది. అమాంతం దానికేదో మంత్రశక్తి వుందని ప్రజలు నమ్మేశారు. అంతే అనుకున్నదే తడవున అక్కడ గుడి నిర్మించారు. అదే బులెట్ బాబా గుడిగా ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ జోధ్‌పూర్ వెళితే దర్శించండి.
http://www.teluguone.com/news/content/bullet-baba-temple-25-139736.html





