ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఓటింగ్ కు బీఆర్ఎస్ దూరం?
Publish Date:Sep 8, 2025
Advertisement
తెలంగాణ రాజకీయ యవనిక నుంచి బీఆర్ఎస్ క్రమంగా కనుమరుగౌతోందా? రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఆ పార్టీ తడబాటే అందుకు నిదర్శనమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మాటల మాంత్రికుడిగా, అపర చాణక్యుడిగా పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారం చలాయించి తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క ఓటమి.. అధికారం దూరం కావడంతో రాజకీయంగా క్రియాశీల పాత్రపోషించడానికి ముందు వెనుకలాడుతున్నారు. పొలిటికల్ డెసిషన్స్ తీసుకునే విషయంలో తడబాటుకు గురౌతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమై.. ఎంపిక చేసుకున్న నాయకులతో మంతనాలకే పరిమితమౌతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కవిత ఎపిసోడ్ లో కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వినా మరేం చేయలేక మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఇక మంగళవారం (సెప్టెంబర్ 9)న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా ఎటువైపు అన్న నిర్ణయం తీసుకోలేక మొత్తంగా ఓటింగ్ కు దూరం కావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఓటింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగ్ కు దూరంగా ఉండాలన్న సూత్రప్రాయ నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మరి కొద్ది మంది నాయకులతో మంతనాలు జరిపిన కేసీఆర్.. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ కు పార్టీ సభ్యులు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు ఎన్డీయేకు లేదా అటు ఇండియా కూటమికి ఎవరికి మద్దతు ఇచ్చినా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావించిన బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఓటింగ్ కు దూరంగా ఉండడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో తబడాటుకు గురౌతోందన్న పరిశీలకులు విశ్లేషణలకు కారణమైంది.
http://www.teluguone.com/news/content/brs-to-stay-away-from-vice-president-election-39-205770.html





