బీఆర్ఎస్ డబుల్ గేమ్.. టార్గెట్ రేవంత్!
Publish Date:Sep 29, 2024
Advertisement
తెలంగాణ రాజకీయానికి హైడ్రా కేంద్ర బిందువుగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం హైడ్రా పేరు మారుమోగుతుంది. హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు కబ్జాలుచేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ కొరడా ఝుళిపించిస్తోంది. అయితే, హైడ్రా ప్రారంభంలో అన్నివర్గాల ప్రజల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ సైతం తొలుత హైడ్రాపై నోరుమెదపలేదు. మేముకూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి అనుకూలమేనని ప్రకటనలు చేసింది. బీజేపీలోని ఓ వర్గం హైడ్రాకు పూర్తి మద్దతు ప్రకటించింది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తో సహా పలు అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన సమయంలో హైడ్రాతో రేవంత్ మంచిపని చేస్తున్నారంటూ ప్రశంసల జల్లు కురిసింది. అయితే, క్రమంగా హైడ్రాకు రాజకీయ రంగు పులుముకోవడంతో వ్యతిరేకత మొదలైంది. అయితు, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా విషయంలో ఎక్కడా తగ్గేదేలే అని స్పష్టంగా చెబుతున్నారు. చెరువులు, నాలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంత పలుకుబడి ఉన్న వారైనా వదిలిపెట్టేది లేదని పలు సభల్లో పదేపదే చెబుతూ వచ్చారు. దీంతో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ పోయింది. ఈ క్రమంలో అంతే స్థాయిలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఇటీవల కాలంలో పేదల ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేస్తుండటం రాజకీయ రచ్చకు దారి తీసింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ షురూ చేసింది. హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, కేసీఆర్‌లు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. దీంతో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే పెద్దపెద్ద కంపెనీల ప్రతినిధులు సైతం తమ ఎంపికలో హైదరాబాద్ ను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకునే స్థాయికి నగరం చేరిపోయింది. అయితే, ఇక్కడ అసలు వాస్తవాలను ప్రస్తావిస్తే.. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మురికి వాడల్లానే ఉన్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్లు జలమయం అవుతాయి. ఇలాంటి పరిస్థితికి కారణం నగరంలోని చెరువులు, నాలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేయడమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఆ సాహసం చేయలేకపోయారు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే నగర ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా ఉండాలంటే చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించాలని భావించి హైడ్రాకు ప్రాణం పోశారు. హైడ్రా వల్ల రాజకీయంగా నష్టపోతామని మంత్రి వర్గ సహచరులు చెప్పినా రేవంత్ పట్టుదలతో చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అయితే, తొలుత సమర్ధించిన బీజేపీ, బీఆర్ఎస్ లు.. ప్రస్తుతం ప్లేట్ ఫిరాయించాయి. రేవంత్ రెడ్డి టార్గెట్‌గా రాజకీయాలను షురూ చేశాయి. హైడ్రా విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో 28వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి.. వాటన్నింటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం.. వరదల నుంచి నగరానికి విముక్తి కల్పిస్తామని బీఆర్ఎస్ హయాంలో 2016లోనే కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పిందో దానినే నేడు కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ కొనసాగిస్తుంటే.. కూల్చివేతలు సమంజసం కాదంటూ బీఆర్ఎస్ వితండ వాదన చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే మూసీనీ సుందరీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ మూసీ సుందరీకరణ కోసం మూసీ పరిసరాల్లోని నివాసితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ఇండ్ల కూల్చివేతలు చేపడతామని ప్రకటించింది. ఈ క్రమంలోనే మూసీ బాధితులకు పరామర్శ అంటూ బీఆర్ఎస్ యాత్రలతో యాగీ చేస్తోంది. దీంతో హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై కేసీఆర్ వాదనకు వ్యతిరేకంగా హరీష్ , కేటీఆర్ ఉద్యమం చేపడుతున్నారని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదేక్రమంలో గతంలో కేసీఆర్ మాట్లాడిన వీడియో…ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ… కేసీఆర్ కు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల హైడ్రా కూల్చివేతలపై నిరసనలు వ్యక్తం అవుతుండగా.. మూసీ సుందరరీకరణ కోసం మరికొన్ని ఇండ్లను కూల్చివేతలకు హైడ్రా సిద్ధమవ్వడంతో రచ్చ పతాక స్థాయికి చేరుకుంది. మూసీ పరిధిలోని ఇండ్లకు అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ యాత్ర చేపట్టింది. గోదావరి నీళ్ళేమోకానీ ప్రజల రక్తం పారుతున్నది అంటూ హరీష్ రావు హైడ్రా కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలోని పేదల ఇల్లు కూల్చాలంటే మామ్మల్ని దాటుకొని వెళ్లాలని హరీశ్ రావు సవాల్ విసిరారు. మరోవైపు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్ సైతం మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల ఇండ్లను కూల్చాలంటే ముందు మాపై బుల్డోజర్లు ఎక్కాలని ప్రకటనలు చేశారు. బీఆర్ ఎస్, బీజేపీలు యూటర్న్ తీసుకొని హైడ్రా కూల్చివేతలు రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. స్థానిక ప్రజల మెప్పు పొందేందుకు ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం హైడ్రా కూల్చివేతలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ళను కూల్చడం సరికాదు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయించి ఆ తర్వాత ఖాళీ చేయించాల్సిందన్నారు. హైడ్రా అధికారులు మాత్రం .. మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఎవరినీ బలవంతంగా పంపించడం లేదని, అందరితో మాట్లాడి, ఒప్పించి, సురక్షితంగా తరలిస్తున్నామని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయిన ప్రతీ ఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇస్తామని స్పష్టం చేశారు. కానీ, బీఆర్ ఎస్, బీజేపీ నేతలు మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోటీపడుతూ రేవంత్ టార్గెట్ గా విమర్శలను ఎక్కుపెట్టారు. రేవంత్ సైతం ఎట్టిపరిస్థితుల్లోనూ హైడ్రా విషయంలో తగ్గేది లేదని తేల్చచెబుతుండటంతో రాబోయేకాలంలో హైడ్రా రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
http://www.teluguone.com/news/content/brs-double-game-25-185855.html





