కాంగ్రెస్ జోష్ కు బ్రేక్ !
Publish Date:Jul 26, 2023
Advertisement
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం నింపింది. జోష్’ పెంచింది. అదే సమయంలో గత ఐదారు నెలలుగా, తెలంగాణ రాజకీయాల్లో కీలకం గా మారిన, బీఆర్ఎస్ బహిష్కృత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అటూ ఇటూ ఊగి చివరకు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడంతో ఆ జోష్ మరికొంత పెరిగింది. అలాగే పొంగులేటితో పాటుగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఇంకా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోకపోయినా ఆయన పార్టీలో చేరడం కేవలం లాంఛనమే అని తేలిపోయింది. ఆయన పార్టీలో చేరినట్లే వ్యవహరిస్తున్నారు. పార్టీ సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. జూలై 30 కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం సైతం ఖరారైంది. కొల్లాపూర్లో జరిగే సభలో జూపల్లి కృష్ణారావు, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఇప్పటికే ప్రకటించారు. మరో వంక ఖమ్మంలో పొంగులేటి చేరిక సభను మరిపించేలా కొల్లాపూర్ సభను జయప్రదం చేయాలని తద్వారా పార్టీలో తన పట్టును పెంచుకునేందుకు జూపల్లి గట్టి పర్యటనలు చేస్తున్నారు. అయితే జూపల్లి చేరికను వ్యతిరేకిస్తున్న పాత కాంగ్రెస్ నాయకులు కొంత గుర్రుగా ఉన్నా, ఆయన తన దారిన తాను ముందుకు సాగుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడిన విధంగాన , రాజకీయ వాతావరణం కూడా కొంత చల్లబడినట్లు కనిపిస్తోంది. పొంగులేటి చేరిక నేపధ్యంగా తెరపైకొచ్చిన ఉచిత విద్యుత్ వివాదం విషయంలో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ ను డిఫెన్సులోకి నెట్టే ప్రయత్నం చేసినా రోడ్లెక్కి ఆందోళనలకు దిగినా అల్టిమేట్ గా హస్తం పార్టీదే పైచేయి అయింది. అదెలా ఉన్నా ప్రతిరోజూ ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కొనసాగుతూనే ఉంది. గాంధీ భవన్ లో నిత్య కళ్యాణ శోభ పరిఢవిల్లుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏమి జరుగుతోంది అనే విషయం పక్కన పెడితే ఓ వంక చేరికలతో మంచి ఊపు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు చిన్న షాక్ తగిలింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ పార్టీకి షాకిస్తూ, యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు ఆయన స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో మంత్రి జగదీష్ రెడ్డిని కలిశారు. అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై కుంభం అనిల్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి, కర్ణాటక గెలుపు, పొంగులేటి, జూపల్లి చేరికలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగినా తెలంగాణలో హస్తం పార్టీ రాజకీయాలకు ఉమ్మడి నల్గొండ జిల్లానే కీలకం. ఈ నేపథ్యంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేయి వదిలి, కారెక్కడం సంచలనంగా మారిందనే చెప్పాలి. అంతే కాదు నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో కోమటి రెడ్డి, రెంత్ రెడ్డి జోడీపై పెరుగుతున్న అసంతృప్తికి అనిల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఒక సంకేతంగా భావిస్తున్నారు. కాగా భువనగిరి కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మధ్య వర్గ పోరు సాగిన విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా కోమటిరెడ్డి గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని, నియోజకవర్గంలో తన ఓటమికి రహస్య మంతనాలు చేస్తున్నారని అనిల్ పలుమార్లు ఆరోపించారు.అయితే ఆరోపణలు చేసింది అనిల్ కుమార్ రెడ్డి అయినా చేయించింది మాత్రం ... కోమటి రెడ్డి అనూహ్యంగా రేవంత్ రెడ్డితో చేతులు కలపడాన్ని జీర్ణం చేసుకోలేని సీనియర్ నాయకులే అని అంటున్నారు. అందుకే అనిల్ కుమార్ రెడ్డి రెడ్డి బీఆర్ఎస్ లో చేరడాన్ని కేవలం చేరిక వ్యవహారంగానే చూడరాదని తెర వెంక కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడుస్తోందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/break-to-congress-josh-25-159006.html





