రైల్వే ట్రాక్ పై పేలుడు.. పంజాబ్ లో ఒకరు మృతి
Publish Date:Apr 28, 2026
Advertisement
పంజాబ్ లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పటియాలా జిల్లా పరిధిలోని ఢిల్లీ-రాజ్‌పురా రైల్వే లైన్‌పై సోమవారం (ఏప్రిల్ 27) రాత్రి సంభవించిన పేలుడులో ఒక గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. అయితే ఆ వ్యక్తి పేలుడు కారణంగా మరణించాడా? మరైదైనా కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పటియాలాలోని శంభు-అంబాలా మార్గంలో రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. గూడ్స్ రైళ్లు ఎక్కువగా ప్రయాణించే ఈ మార్గంలో పేలుడు ధాటికి రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ , రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే ఒక వ్యక్తి మృతదేహం ఛిద్రమైన స్థితిలో పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఆ వ్యక్తి మరణానికి, ఈ పేలుడుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు పేలుడు పదార్థాలను అమర్చడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. ఈ ఘటనను విద్రోహ చర్యగా అధికారులు భావిస్తున్నారు. రైల్వే కార్యకలాపాలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా ఈ పేలుడు జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు.
http://www.teluguone.com/news/content/bobm-blast-on-railway-track-in-punjab-36-218426.html





