బెడిసి కొడుతున్న బీజేపీ వ్యూహాలు .. గొప్ప సాక్ష్యం అగ్నిపథ్ !
Publish Date:Jun 19, 2022
Advertisement
ప్రభుత్వం అన్నాక అద్భుతంగా పాలన సాగించి అందరి మన్ననలూ అందుకుంటూ ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేసి అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలి. కానీ బిజెపి ప్రభుత్వం ఇందుకు పూర్తి భిన్నంగానే నడుస్తోందని విపక్షాలు ఇప్పటికే దుమ్మెత్తి పోస్తున్నాయి. అసలు బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ మత విద్వేషాలు పెరిగాయన్న అవవాదు బిజెపి సర్కార్ మూటగట్టుకున్నది. తమను ప్రశ్నించడానికి అవకాశం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్న పుడు ఎలాంటి వ్యతిరేకత విశ్వరూపం దాల్చదు. కానీ తాము చేసే పనులను, పథకాల్లో లేదా సహాయక చర్యల్లో లోపాలను ప్రశ్నిస్తే బొత్తగా తట్టుకోలేకపోతున్న బిజెపి పాలనంతా కాషాయ మయం చేయడం వారి ధోరణి ప్రజలు గమనించకపోవడం లేదు. దేశంలో అసలు ప్రతిపక్షం వుండకూడదనుకున్నపుడు కనీసం పాలనాపరంగా, లేదా ప్రజలను ఆకర్షించే ఆనందపరిచే కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, వైద్య, సైనిక రంగాల్లో అందరికీ ఆమోదయోగ్య పథకాలు, పనులు చేయాలి. కానీ అలా ఏవీ జరగలేదు. తాము ఆలోచించి చేసుకున్న నిర్ణయాలు తప్ప విపక్షాలతో చర్చించి అమలు చేస్తున్నవి ఏవీ లేవు. అందుకే వ్యవసాయ రంగానికి సంబంధించి చేపట్టిన కార్యక్రమాలు ఏవీ ఫలించలేదు. చట్టాలను మార్పు చేర్పులు చేయాలన్న ప్రయత్నం భయంకరంగా బెడిసికొట్టింది. ఇప్పుడు సైనిక రంగానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం మరింత దారుణంగా విఫలమయిందనే అనాలి. కేంద్రం వూహించనంత వ్యతిరేకత వెల్లువెత్తింది. అన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరుగుతు న్నాయి. ఇలాంటి ఘోరపరిస్థితులకు కేంద్రం బాధ్యత వహించి వారి మానసపుత్రిక అయిన ఆ గొప్ప అగ్నిపథ్ అనే గొప్ప పథకం సినిమాలానే సక్సస్ అవుతుందని అనుకున్నారు. కానీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ముఖ్యంగా ఆర్మీలో చేరాలను కున్న యువత మండిపడేట్లు చేస్తుందని వూహించి వుండకపోవచ్చు. అసలు బిజెపి ప్రభుత్వం మొండిగానే మొదట్నుంచీ వ్యవహరిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ తమ మాటే రాజశాసనం, తాము చెప్పిందే జరిగి తీరాలన్న మూర్ఖత్వ ధోరణే బిజేపీ నాయకులు, వీరాభిమానులూ బాగా ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలు రైతులకు అర్థం కావు. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు. పెద్దనోట్ల రద్దు సామాన్యులకు అర్థం కాదు. సీఏఏ ముస్లింలకు అర్థం కాదు. ఎల్పీజీ ధరలు గృహిణులకు అర్థం కావు. ప్రస్తుతం అగ్నిపథ్ యువతకు అర్థం కాదు. విశ్వగురుకు మాత్రమే ఆ అర్థం తెలియాలి అని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనపై రాష్ట్ర మంత్రులు పలువురు విచారం వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం వారి అగ్నిపథ్ పథకం తాజాగా దేశమంతటా వ్యతిరేకతను మూటగట్టుకుంది. అగ్నిపథ్‌లో నాలుగేళ్లు ఆర్మీలో పనిచేసి, 75 శాతం మంది తిరిగి నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఉంది. నాలుగేళ్లు పనిచేసి బయటకు వచ్చిన అగ్నివీరులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కేంద్రం చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధం. ఇప్పటికే ఏళ్ల తరబడి ఆర్మీలో పనిచేసి బయటకు వచ్చిన మాజీ సైనికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రం విఫలమైంది. పెన్షన్ డబ్బులు ఆదా చేసేందుకు చౌకబారు నిర్ణయం తీసుకుని దేశ భద్రత కన్నా ఆర్థికపరమైన అంశాలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్రం కళ్లు తెరిచి ఈ విధానాన్ని వెంటనే పున:సమీక్షించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అన్న కేంద్రం.. నేడు ర్యాంకూ లేదు. పింఛనూ లేదన్నట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఆఫీసు గదిలో కూచుని ఒక పథక రచన చేసి దాన్ని అమలు చేయడానికి ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంగా అమలు చేస్తే పరిస్థితులు ఇలానే ఎదురుతిరుగుతాయన్నది బిజెపీ వర్గీయులకు ఇప్పటికయినా తెలిస్తే బావుంటుంది. ఎంతసేప టికి విపక్షాల మీద నోరువేసుకుని పడిపోవడం బాగా అలవాటయింది. ఇకనైనా పథకాల విషయంలో నలుగురితో చర్చించాలన్న జ్ఞానం కలగాలి.
http://www.teluguone.com/news/content/bjp-stratagies-not-working-latest-evidence-is-agnipath-25-137968.html





