ఏపీలో రాష్ట్రపతి పాలన బీజేపీ స్కెచ్ నిజమేనా ?
Publish Date:Jul 20, 2022
Advertisement
నిజానికి, సంకీర్ణ ప్రభుత్వాలు అర్ధాంతరంగా కుప్ప కూలిపోవడం మహా రాష్ట్రతోనే మొదలు కాలేదు. అలాగే, మూకుమ్మడి పార్టీ ఫిరాయింపులకు శివసేన చీలిక వర్గం నేత, మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేనే శ్రీకారం చుట్టలేదు. మహారాష్ట్రకు ముందు కూడా రాష్ట్రాలలోనే కాదు కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో ఆటల్ బిహారీ వాజ్’పేయి 13 నెలల ప్రభుత్వం, ఒకే ఒక్క ఓటు తేడాతో కూలిపోయింది. కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వం, పార్లమెంట్ ముఖం చూడకుండానే పడిపోయింది, అలాగే, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాలు కాంగ్రెస్ పుణ్యానే అర్ధాంతరంగా కాలం చేశాయి. ఇందులో ఏ ఒక్క ప్రభుత్వం కూడా కనీసం సంవత్సరం అయినా, నిలబడ లేదు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్న, మరుక్షణం సంకీర్ణ ప్రభుత్వాలు పేక మేడల్లా కూలిపోయాయి. ఇక రాష్ట్రాల సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. కేంద్రంలో బీజేపే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన ఎనిమిది సంవత్సరాలలోనే ఎనిమిది ప్రభుత్వాలను తమ ఖాతాలో కలిపేసుకుంది. ఇక కాంగ్రెస్ జమానా కథ చెప్పాలంటే, చాలానే వుంది. కాంగ్రెస్ హయాంలో ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలలో కనీసం వంద సార్లకు పైగానే రాష్ట్రపతి పాలన విదించిన చరిత్ర కళ్ళ ముందే వుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ఎలా కూల్చారు, నాదెండ్ల భాస్కర రావును ఎలా 30 రోజుల ముఖ్యమంత్రిని చేశారు తెలియంది కాదు. అది చరిత్ర. అయినా, ఇప్పడు ఎక్కడ ఫిరాయింపుల ప్రస్తావన వచ్చినా షిండే పేరే వినిపిస్తోంది. నిజానికి షిండే కొత్తగా చేసింది ఏమీ లేదు. నీవు నేర్పిన విద్యయే, అన్నట్లుగా 2019లో శివసేన అధినేత ఉద్దవ్ థాకరే చేసిందే, 2022 లో షిండే చేశారు. అయితే అప్పుడు ఆయన బీజేపీ, శివసేన కూటమిని ముక్కలు చేసి ముఖ్యమంత్రి అయితే, ఇప్పడు షిండే శివసేనను చీల్చి సీఎం అయ్యారు. అయినా అదేమిటో షిండేను ఫిరాయింపులకు పర్యాయపదం అన్నట్లుగా చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య రెండున్నర గంటల ప్రెస్ మీట్ కనీసం ఓ అర్థ శతకం (50) సార్లకు పైగానే షిండే పేరు తలచు కున్నారు. తమిళనాడులోనూ అధికార డిఎంకేలో షిండే ఉన్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై బహిరంగగానే హెచ్చరికలు చేస్తున్నారు. అదలా ఉంటే, రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే అయినా లేని ఏపీలోనూ బీజేపీ పౌరోహిత్యంలో షిండే సృష్టి జరుగుతోందని వార్తలొస్తున్నాయి. నిజమే, అధికార వైసీపీలో అసంతృప్తి చాప కింద నీరులా చకచకా పాకుతోంది. మత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో తాజా మాజీ మంత్రులలో మొదలైన అసంతృప్తి మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి కాదంటూనే కొందరు సీనియర్లకు స్థానం కల్పించారు. అయితే, మంత్రి పదవులు ఇచ్చినా జూనియర్ మంత్రులకు ఇచ్చిన గౌరవం ఇవ్వకపోవడంతో, సీనియర్ మంత్రులలో చికాకులు ఎక్కువయ్యాయి. ఒక విధంగా తమకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోగా జూనియర్లకు ఎక్కువ గౌరవం ఇవ్వడంతో సీనియర్ మంత్రులు కొందరు షిండే వేషం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని అంటున్నారు. అలాగే, ఎమ్మెల్యేలలో అసంతృప్తితో పాటుగా అవమానంతో కూడిన అగ్రహం కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా, హెచ్చరికలు చేస్తుంటే, ఎమ్మెల్యేలు ముఖ్యమత్రి పట్ల అసంతృప్తితో ఉన్నారు. అవకాశం చిక్కితే ఎగిరిపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, ఆ మధ్యన వైసీపీలోనూ షిండేలున్నారని అర్థం వచ్చేలా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పార్టీలో సజ్జల వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. నిప్పులేకుండా పోగ రాదని, అంటున్నారు. అయితే, ఎవరా షిండే అంటే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినివస్తోంది అని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి, జూనియర్ రోజా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో అదే పరిస్థితి. అయినా పెద్దిరెడ్డి గట్టిగా వ్యతిరేకించినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రోజాకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇప్పడు జిల్లా రాజకీయాల్లో జూనియర్ రోజాకు ఉన్న ప్రాధాన్యత సీనియర్ పెద్దిరెడ్డికి లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇలా పూలమ్మిన చోట కట్టెలు అమ్మవలసి వస్తుంది ఉహించని పెద్దిరెడ్డి అసహనంతో రగిలి పోతున్నారని అంటున్నారు. అంతే కాకుండా, ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్నారని, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పెద్దిరెడ్డితో పాటుగా, జగన్ రెడ్డి బంధు వర్గానికి చెందిన మరో ఇద్దరు ముఖ్య నేతలతో కూడా బీజేపీ నాయకులు టచ్ లో ఉన్నారని అంటున్నారు. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుటుంబ సభ్యులు, జిల్లా నేతలు, కార్యకర్తల వరకు అందరిలో గూడుకట్టుకున్న అసంతృప్తిని ఉపయోగించుకుని, బీజేపీ జగన్ సర్కార్ ను కూల్చే ప్రయత్నాలు మొదలు పెట్టిందని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, బీజేపీ ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చితే కూల్చగలదేమో కానీ, మహారాష్ట్రలో లాగా ప్రత్యాన్మాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే, బీజేపీ కోరుకుంటోంది కూడా అదేనని, రాజకీయ సంక్షోభం ఏర్పడితే, రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుందని, అదే జరిగితే. ఆ తర్వత కథ మరోలా ఉంటుందని అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం, రాజధాని సమస్యకు పరిష్కారం చూపడం, విభజన హామీల అమలు .. ఇలా చేతిలో ఉన్న పనులు కానిచ్చి .. రాష్ట్రంలో పాగా వేయడం బీజేపీ నాయకుల వ్యూహంగా చెపుతున్నారు. అయితే .. అన్నీ అనుకున్నట్లు జరుగుతాయా అంటే అది ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. కానీ, జగన్ ప్రభుత్వం నిండా అయిదేళ్ళు అధికారంలో కొనసాగడం మాత్రం అయ్యే పనిగా కనిపించడం లేదని అంటున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు,అదే విధంగా శ్రీలంక పరిణామాలపై చర్చకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో, ఏపీ ప్రభుత్వం అప్పుల చిట్టాను ఎత్తి చూపడం, స్వయంగా ప్రధాన మంత్రి ఉచిత హామీల విషయంగా చేసిన హెచ్చరికలు, ఇలా ఒకదాని తర్వతా ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిష్తే.. ఏదో జరుగుతోందనే అనుమనాలు మాత్రం బలపడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-sketch-for-president-rule-in-ap-39-140129.html





