బీఆర్ఎస్, బీజేపీ కుట్రే అంటున్న బీసీ సంఘాలు
Publish Date:Oct 10, 2025
Advertisement
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇస్తుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఎలా తెలుసు? అన్న ప్రశ్న ఇప్పడు బీసీ సంఘాల నుంచి వస్తున్నది. కాంగ్రెస్ లేస్త లేదు, బీఆర్ఎస్ సస్త లేదు, బీజేపీకి చూస్తే అవకాశం మంచిగుంది అంటూ జీవోపై కోర్టు స్టే ఇవ్వడానికి ఒక రోజు ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్న మాటలేంటంటే.. కాంగ్రెస్ కోర్టులో పెద్దగా కొట్లాడదు కావాలంటే చూడండి అన్నారు. ఈ విషయం అంతగా ఆయనకు ఎలా తెలుసు? అన్నదొక ప్రశ్న కాగా.. ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీసీ సంఘాల కామెంట్ ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై చేసిన కుట్రగా అభివర్ణించారు. బీఆర్ఎస్ అప్పట్లోనే 50 శాతానికి మించకుండా బీసీలకు చట్టం తీసుకొచ్చిందనీ, కేంద్రంలో ఉన్న బీజేపీ వీరికి మరింత సహకారం అందిస్తోందని దుయ్యబడుతున్నాయి బీసీ సంఘాలు. తమకు లేక లేక ఒక అవకాశం వస్తే మా నోటికాడ కూడు లాగేసుకున్నారని తీవ్రంగా మండి పడుతున్నారు బీసీలు. వీహెచ్ అయితే నాలుగు వారాల వాయిదా అంటే తమకు ద్రోహం చేయడమేనని అనగా.. ఆర్ కృష్ణయ్య బీసీల నోట్లో మట్టి కొట్టారని.. మేం బందుకు పిలుపునిస్తున్నామని ప్రకటించారు. ఇక హైకోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ రవి వర్మ.. రాష్ట్రంలో 15 శాతం కూడా లేని ఓసీలకు ఎందుకు అంత రిజర్వేషన్ ఏం చేస్కుంటారు? అసలు మీకు 62 శాతంతో వచ్చిన సమస్య ఏంటన్నది ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే 1990ల కాలంలో నాడు జయలలిత.. ఢిల్లీ వెళ్లి అక్కడ అప్పటి ప్రధాని పీవీ ముందు కూర్చుని నా రిజర్వేషన్ నాకు ఇస్తారా చస్తారా అన్నట్టు కొట్లాడారనీ, మనం కూడా అలా వెళ్లి మోడీ ఇంటి ముందు కూర్చుందాం రమ్మంటూ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ తరఫు నుంచి గంగుల కమలాకర్. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీఎంతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలసి.. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అంత పెద్ద ధర్నా చేస్తే.. అప్పుడు బీఆర్ఎస్ ఎక్కడుందో చెప్పాలని నిలదీశారు కాంగ్రెస్ లీడర్లు. దేశంలోనే తొలిసారిగా మేం చిత్తశుద్ధితో కులగణన సర్వే చేపడితే కనీసం పాల్గొనని బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఒక అసెంబ్లీ తీర్మానం చేశాక, అది కూడా అన్ని పక్షాల మద్దతుతో ఏకగ్రీవ ఆమోదం పొందిన బిల్లును హైకోర్టు తప్పు పట్టడం, స్టే ఇవ్వడం ఏమిటంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఒక బిల్లును అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ దగ్గరకుగానీ, రాష్ట్రపతి దగ్గరకుగానీ పంపితే.. మూడు నెలల్లోగా తేల్చేయాలి. ఒక వేళ అలా జరక్కుంటే ఆ బిల్లు ఆమోదయోగ్యమైనట్టేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తేదీలతో సహా గుర్తు చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇక మా చిత్తశుధ్దిని శంకించడానికి బీఆర్ఎస్, బీజేపీలు సరిపోవని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చేయాల్సిందంతా చేసి వారు ఇప్పుడు ఆడుతున్న ఈ నాటకాలు ప్రజలంతా గమనిస్తున్నారని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. ఇక మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, కాంగ్రెస్ 42 శాతానికి కట్టుబడి ఉందని.. ఇది తెలంగాణ ఇవ్వడంలో అయినా బీసీ రిజర్వేషన్ల సాధనలో అయినా ఒకటే విధానంతో వ్యవహరిస్తుందని అన్నారు మంత్రి వాకిటి. రేవంత్ తమ పాలిట దేవుడిలా ఈ రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చారని.. అయినా సరే వీరంతా కలసి తమ నోటికాడ ముద్ద లాగేసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు ఒక లేడీ లాయర్. సుప్రీంకైనా వెళ్లి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ కట్టుబడితే.. తామంతా కలసి వస్తామని అన్నారు బీసీ సంఘం నేతలు. హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ దిశగా ఒక గెజిట్ కూడా విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎన్నికల కోడ్ కాస్తా రద్దయ్యింది.
http://www.teluguone.com/news/content/bjp-and-brs-conspiracy-on-bc-reservations-39-207663.html





