ఓట్ల చోరీ.. భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు?
Publish Date:Aug 17, 2025
Advertisement
భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన, ఆరోపణలకు బలం చేకూరుతోంది. బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు భారత ఎన్నికల కమిషన్ పనితీరుపై సందేహాలను లేవనెత్తుతోంది. బీహార్ ఓటర్ల జాబితా లో 65 లక్షల మందిని తొలగించారని,ఎన్నికల సంఘంతో ప్రభుత్వం కుమ్మక్కైందని పార్లమెంటులో 15 రోజులుగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలగించినట్లు ఆరోపిస్తున్న 65 లక్షల ఓటర్ల పేర్లు, వివరాలను 48 గంటల్లో అధికారిక వెబ్ సైట్లో పెట్టాలని ఆదేశించింది. తొలగించడానికి కారణాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎన్నికల కమిషన్ ను షాక్ అనే చెప్పాలి. ఓటర్ల సవరణ పేరుతో తొలగించడం అక్రమమని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. సుప్రీంకోర్టు జోక్యం తో ఓట్ల చోరీ కేసులో నిజాలు బయటకు వస్తాయా, ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవాలు తేలతాయా అంటే ఇతమిథ్ధంగా చెప్పలేమన్నది విశ్లేషకుల మాట. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై ఇలాంటి అక్రమానికి పాల్పడిందన్నది కాంగ్రెస్, ఇండియా కూటమి ఆరోపణ. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న విడుదల చేసింది. దాని ప్రకారం 65.6 లక్షల ఓటర్ల పేరు తొలగించారు. సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఉన్న ఓటర్లలో తొలగించింది 9 శాతం. ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. అలాగే గత (2020 ఎన్నికలు), 2024 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే ఈసారి కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందన్న ఆరోపణలున్నాయి. 1977 తరువాత ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమం. సగటున ఇదే 9 శాతం దేశవ్యాప్తంగా పరిగణలో తీసుకుంటే 9 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతయ్యాయి. ఈ సంఖ్య బ్రిటన్ లోని ఓటర్ల సంఖ్యకు ఒకటిన్నరెట్లు అధికం. బీహార్లో 30 లక్షల ఓటర్లు అర్హత ఉండి కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్రించుకోలేకపోయారన్నది వాస్తవం. ఓటర్ల జాబితా లో మృతిచెందారని పేర్కొన్న వారితో ఫోటోలు దిగి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. మృతులతో ఫోటోలు దిగే భాగ్యం కల్పించినందుకు కృతజ్ణతలు అంటూ ఆయన వ్యంగ్యంగా చేసిన పోస్టు హాట్ ను మరింత పెంచేసింది. మరణించారంటూ ఓటరు జాబితా నుంచి తొలగించిన వారితో ఆయన చాయ్ తాగుతూ దిగిన ఫొటోను సామాజిక మాధ్యమలో పోస్టు చేశారు. ఎన్నికల కమిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు 300 మంది పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకూ ఓట్ల చోరీ నినాదంతో భారీ ప్రదర్శన చేసారు. ఈ ప్రదర్శనలో ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహూల్, ప్రియాంకగాంధీ సహా పలువురి అరెస్టు చేశారు. తమది రాజ్యాంగాన్ని కాపాడే పోరాటమని, ఓటర్ల చోరీ ఉద్యమం మహోద్యమం గా మారుతుందనడంలో సందేహంలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఓట్ల చోరీ అంటూ రాహుల్ ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఓట్ల చోరీ జరిగిందని ప్రామాణిక పత్రంపై సంతకం చేసి ఇస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అలా చేయకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే రాహుల్ ఆరోపణలపై కర్ణాటక,హర్యానా ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసారు. రాహుల్ లేవనెత్తిన అంశానికి ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వకుండా ప్రమాణాలు చేయ్యాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మోడీ హయాంలో సందేహాలకు తావిచ్చేదిలా ఉందనడంలోసందేహం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలు మోదీ హయాంలో ఎన్నికల కమిష న్ ను నిర్వీర్యం చేసారన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. శేషన్ హయాంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఎలా ఉండవచ్చో చూపించారు. అయితే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ వెన్నెముక లేని సంస్థగా మారిపోయిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను సామాన్యులు సైతం సమర్ధిస్తున్నారు. బీహార్ లో ఓటర్ల తొలగింపు అంశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పోరాటంతో భారత ఎన్నికల సంఘం, కేంద్రంలోని మోడీ సర్కార్ డిఫెన్స్ లో పడ్డాయనడంలో ఇసుమంతైనా సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇక తాజాగా తొలగించిన ఓటర్ల వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రతిపక్షాల వాదన సరైనదేన్న భావన సర్వత్రా కలిగేలా చేశాయి.
http://www.teluguone.com/news/content/bihar-vote-chori-allegations-diminish-pride-of-eci-39-204399.html





