బీహార్ ఫలితాలతో ఓట్ చోరీ.. ఆరోపణల నిగ్గు తేలనుందా?
Publish Date:Oct 7, 2025
Advertisement
అటు బీహార్ ఎన్నికతో పాటు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదలైంది. నవంబర్ 6, 11వ తేదీల్లో బీహార్ లో రెండు విడతల పోలింగ్ జరగనుండగా.. అదే నెల 14న ఫలితాలు విడుదల కానున్నాయి. బీహార్ సీట్ల సంఖ్య 243 కాగా, ఓటర్ల సంఖ్య 7. 43 కోట్లుగా ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంగతేంటని చూస్తే.. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్లను స్వీకరించనుండగా.. 21 తుదిగడువు. 22వ తేదీ పరిశీలన, 24వ తేదీ ఉపసంహరణ. కాగా నవంబర్ 14న ఈ ఉప ఎన్నిక ఫలితం కూడా తేలనుంది. ఈ రెండు ఎన్నికలు కాంగ్రెస్ కి ఎంత కీలకమంటే.. ఒక పక్క దేశ వ్యాప్తంగా రాహుల్ ఓట్ల చోరీ ప్రచారం చేయడంతో పాటు బీహార్ లో ప్రత్యేకించి ఆయన యాత్ర నిర్వహించారు. ఎందుకంటే బీహార్ లో సుమారు 45 లక్షల ఓట్లు తొలగించడంతో.. రాహుల్ పెద్ద ఎత్తున ఓట్ల చోరీ పై ప్రెజంటేషన్లిచ్చి.. ఈసీ ని ఇరుకున పెట్టే యత్నం చేశారు. ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై రియాక్టయిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆధారాలతో సహా కంప్లయింట్ చేయాలని రాహుల్ కి సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు తగవని వారించారు. తాను ప్రత్యేకించీ ఆధారాలు చూపించనక్కర్లేదనీ.. తన ప్రెజంటేషన్లు తీసుకుని వాటిపై మీరు స్పందించాలంటూ కౌంటర్ ఇచ్చారు రాహుల్. ఏది ఏమైనా రాహుల్ ఓట్ల చోరీ ప్రచారమంతా కూడా బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిందే. దానికి తోడు ఆయన ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేసిన యాత్ర కూడా ఇదే చెబుతోంది. ఇప్పుడు రాహుల్ ఓట్ చోరీ ప్రచారం జనం నమ్మారా లేదా? అన్నది ఈ ఎన్నికల ఫలితం తేల్చేస్తుందంటున్నారు పరిశీలకులు. కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను బటి కాంగ్రెస్ ఎలిగేషన్లు జనం సీరియస్ గా తీస్కుంటున్నారా లేదా? అన్నదానిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇక చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇప్పటికే ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ అభ్యర్ధిగా మాగంటి సతీమణి సునీతను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ బై పోల్ కూడా కాంగ్రెస్ కి అగ్ని పరీక్షేనని చెప్పాలి. రేవంత్ సర్కార్ హైదరాబాద్ లో హైడ్రా ప్రయోగం ద్వారా చేసిన మేలు ఎలాంటిదో చెప్పలేం కానీ.. జనం మాత్రం బ్యాడ్ గా ఫీలవుతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు హరీష్ రావ్ ఇక్కడ ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్కుని.. ఈ కమ్యూనిటీకి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారు. ఆపై ఇక్కడ అధికంగా ఉండే సినీ జనం, అందునా ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గం. వీటన్నిటినీ కవర్ చేయడానికి మాగంటి సామాజిక వర్గం సరిపోతుందని భావిస్తోంది కారు పార్టీ. దీంతో ఈ గెలుపు తమకు నల్లేరు నడకే అన్న ఊహల్లో ఉంది గులాబీ దండు. అయితే కాంగ్రెస్ మాత్రం ఎట్టకేలకు జూబ్లీహిల్స్ ద్వారా మరో కంటోన్మెంట్ రిజల్ట్ రిపీట్ చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఇక ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ అయితే ఈ సీటు ఎలాగైనా సరే కైవసం చేసుకోడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా బీహార్ పోల్, జూబ్లీ బై పోల్ కాంగ్రెస్ కి రెఫరండంగా మారనున్నాయనే అంటున్నారంతా. మరి చూడాలి.. ఈ ఫలితాలు కాంగ్రెస్ కి ఎంత అనుకూలంగా వస్తాయో తెలియాలంటే మనం నవంబర్ 14 వరకూ ఎదురు చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/bihar-elections-key-for-congress-39-207477.html





