నేడు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం..షెడ్యూల్ ఇదే..!
Publish Date:Jul 31, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 10:45 గంటలకు భోగాపురం చేరుకోనున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తదితరులు స్వాగతం పలుకుతారు.. ప్రధానికి సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నారు. టెర్మినల్ వద్ద 200 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. సుమారు 2 గంటల 25 నిమిషాల పాటు ప్రధాని భోగాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమం జరగనుంది. అనంతరం ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రధాని బహిరంగ సభకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:05 గంటలకు భోగాపురం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా గిరిజన మహిళలు, బాలికలు ప్రధాని మోదీకి థింసా నృత్యంతో విశిష్ట స్వాగతం పలకనున్నారు. ఏకరీతి దుస్తులు ధరించి, సంప్రదాయబద్ధంగా వారు చేసే నృత్యం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభ వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, పి. నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. Bhogapuram Airport Flight Schedule, Air India New Flights Vizag, Bhogapuram International Airport, Hyderabad to Bhogapuram Flights, Vijayawada to Bhogapuram Air India, Vizianagaram Airport Operations
http://www.teluguone.com/news/content/bhogapuram-airport-flight-schedule-36-227698.html





