భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Publish Date:Jul 31, 2026
Advertisement
55 అడుగులు దాటిన నీటిమట్టం..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి ఉద్ధృతంగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు శనివారం ఉదయం మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం వేగంగా పెరుగుతూ 55.1 అడుగులు దాటడంతో తీరప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటమే ఈ వరద ఉద్ధృతికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నీటిమట్టం ఊహించని రీతిలో పెరిగింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. వరద తాకిడికి భద్రాచలం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల వద్ద స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. సీతమ్మ నార చీరలు, దేవతామూర్తి పీఠంతో పాటు సీతావాగుపై ఉన్న ఇనుప వంతెనను వరద నీరు ముంచెత్తింది. దుమ్ముగూడెం, భద్రాచలం మార్గంలో తురుబాక రహదారిపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు చార్ల మండలంలోని ఒక ఇసుక క్వారీలో అకస్మాత్తుగా వరద నీరు చుట్టుముట్టడంతో తీవ్ర కలకలం రేగింది. నీటి దిగ్బంధంలో చిక్కుకుపోయిన 44 మంది లారీ డ్రైవర్లు, స్థానిక కార్మికులను అధికారులు సాహసోపేతంగా రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెస్క్యూ ప్రక్రియలో ఇద్దరు అధికారులు తెప్పపై నుంచి నీటిలో పడిపోయినప్పటికీ, ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. అలాగే అశ్వాపురం మండలంలో ఒక గర్భిణిని తెప్పపై సురక్షిత ప్రాంతానికి చేర్చారు. వరద పరిస్థితులపై రాష్ట్ర రెవెన్యూ, పునరావాస శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజల రక్షణ కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఉప్పొంగుతున్న వాగులు, వంకలను దాటే సాహసం ఎవరూ చేయవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం ప్రజలను హెచ్చరిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎగువ నుంచి ప్రవాహం ఇలాగే కొనసాగితే గోదావరి నీటిమట్టం మరికొంత పెరిగే ప్రమాదం ఉండటంతో, రానున్న 24 గంటలు భద్రాచలం పరిసర ప్రాంతాలకు ఎంతో కీలకమని అధికారులు భావిస్తున్నారు. Bhadrachalam Godavari floods, third danger warning, Bhadradri Kothagudem district, Parnasala flooded areas, Telangana rains Godavari water level
http://www.teluguone.com/news/content/bhadrachalam-godavari-floods-36-227696.html





