కోరిక తీరిస్తే పాస్ చేయిస్తా.. ప్రొఫెసర్ ట్రాప్ లో 20 మంది బాలికలు!
Publish Date:Jul 7, 2019
Advertisement
తల్లిదండ్రులు తరువాత గురువు దైవంతో సమానం అంటారు. స్టూడెంట్స్ ని బిడ్డల్లా చూసుకుంటూ, విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి.. ఓ కీచక ప్రొఫెసర్ కోరిక తీరిస్తే పాస్ చేయిస్తానంటూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఈ బాగోతం బయటపడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే...బాసర ట్రిపుల్ ఐటీ కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రవి వరాల పీయూసీ-2 సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థినికి మెసేజ్ పంపాడు. ‘నిజామాబాద్‌లో ఉన్న మా ఇంటికి రా, ఇదే నా అడ్రస్. నిన్ను పాస్ చేయిస్తా’ అన్నది ఆ మెసేజ్ సారాంశం. సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థిని నిన్న వర్సిటీ నుంచి తిరిగి ఇంటికి బయలుదేరింది. వర్సిటీ నిబంధనల ప్రకారం విద్యార్థినులకు ఔట్‌పాస్ ఇచ్చే ముందు విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడాలి. దీంతో వార్డెన్ ఔట్ పాస్ ఇచ్చే ముందు మీ నాన్నతో మాట్లాడించు అని సదరు విద్యార్థినికి సూచించింది. ఇందుకోసం ఆమె ఫోన్ తీసుకుని ఆమె తండ్రి ఫోన్‌కి డయల్ చేస్తుండగా, అదే సమయంలో సదరు ప్రొఫెసర్ పంపిన మెసేజ్ విద్యార్థిని మొబైల్ కి వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన వార్డెన్ ఆ మెసేజ్ చదివి ఆశ్చర్యపోయారు. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సదరు విద్యార్థినిని తొలుత విచారించగా ‘ఇంటికొస్తే పాస్ చేయిస్తానని సార్ చెప్పారు’ అంటూ చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో అధికారులు బాలిక తల్లిదండ్రులను కూడా పిలిపించి వారి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఈ లైంగిక వేధింపుల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు నిన్న సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న వర్సిటీ వీసీ అశోక్‌కు జరిగిన విషయంపై సమాచారం అందించారు. అనంతరం విద్యార్థిని స్టేట్‌మెంట్ మేరకు రవి వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపించారు. విచారణ కమిటీ నివేదిక మేరకు ఆయన్ను విధుల నుంచి తొలగించారు. కాగా, ఇప్పటి వరకు సదరు ప్రొఫెసర్ దాదాపు 20 మంది విద్యార్థినులను ఇలా లైంగికంగా వేధించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. తన మాట విన్న విద్యార్థినులతో పరీక్ష తన ఇంట్లోనే రాయించి తర్వాత మేనేజ్ చేస్తాడని సమాచారం. ఇతనిపై ప్రశ్నపత్రాలు లీక్ చేసిన కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. గురువు అనే పదానికే కళంకం తెచ్చిన ఈ ప్రొఫెసర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/basara-iiit-professor-misbehaving-with-girl-students-39-87864.html





