బాపు జయంతి రోజు నెట్టింట వైరల్ నివాళి

Publish Date:Dec 16, 2022

Advertisement

బాపు తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు.. తెలుగుదనం ఉట్టిపడే బొమ్మల కొలువును కానుకగా ఇచ్చిన దానకర్ణుడు. రాతలోనే కొత్త వాసిని ప్రపంచానికి పరిచయం చేసిన బాపు జయంతి గురువారం. ఆ సందర్బంగా అశేష బాపు అభిమానుల్లో ఒకరు నెట్టింట పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. తెలుగు లోగిళ్లలో బాపు బొమ్మ లేని ఇల్లు ఉంటుందంటే అతిశయోక్తే. అంతగా బాపు గీత  తెలుగు జీవితంలో జీవనంలో మమేకమైపోయింది. తెలుగు వన్ పాఠకుల కోసం ఆ అజ్ణాత నెటిజన్ పెట్టిన పోస్టును ఇక్కడ యథాతథంగా ఇస్తున్నాం.

గుండ్రంగా రాయడం రాక ఇలా వంకరటింకరగా లాగించేస్తున్నాడు... ఏం తెలివి?’ అనేసుకుని నోట్లో కొంగులూ, కండువాలూ కుక్కేసుకున్నార్ట! ఆ అక్షరాలు చూడ్డానికి అదోలా వుంటాయి. కాసేపు  చూస్తే ‘ఏదోవుందిందులో!’ అనిపించేస్తుంది. ఆనక పుస్తకం మూసేశాక మళ్ళీ తెరిచి చూడాలనిపిస్తుంది.  మనం పెట్టే కొమ్ములూ, దీర్ఘాలన్నింటినీ కొత్తరకంగా తగిలించే తెలివి.  పేరంతా రాసేసిన తరవాత చూస్తే ఊరేగింపుకి తయారైన దేవుడి పల్లకీలా వుంటుంది.  ఆ నిండుదనం గోదారినించీ, ఆ అందం చందమామనించీ తెస్తాడు. 
ఇహ బొమ్మలు....
ఒక స్త్రీ బొమ్మంటే మనం చదువుకున్న సామాన్యశాస్త్రం పుస్తకంలో ఆడమనిషి బొమ్మలా అందరూ వేస్తున్న రోజుల్లో ఇతగాడు చుక్కల ముగ్గెట్టినంత చులాగ్గా వేసేసి చూపించాడు.  రావాకుల్లా పరుచుకున్న రెండుకళ్ళు, మకరధ్వజాల్లా కనుబొమ్మలు, చదరంగంలో శకటులా దీటైన ముక్కు,  చిన్న చెగోడీలా నోరూనూ!  చూడగానే ముద్దిస్తున్నట్టూ, ముద్దొస్తున్నట్టూ అనిపించేస్తుంది ఎవరికైనా!  ఇహ మెడా, జడా సంగతి సరే సరి! జుట్టంతా పొందిగ్గా అల్లి, పాపిడితీసి, నాగుబాములా పేద్ధ జడేసేసేవాడు. చివర్న ఓ రెండు గంటలు కట్టేవాడు.  నడుం మీద ఆట్టే ఆసక్తి చూపెట్టేవాడు కాదు. ఎంచేతంటే...అసలది వుంటేగా? అలా గీసేవాడు మరి!  ఈ యవ్వారాలన్నీ పూర్తయ్యేసరికి మగపిల్లలందరికీ గుండెల్లో గుబులు మొదలయ్యింది. 

పెళ్ళిచేసుకోరా నాయనా!  అని బామ్మలూ, అమ్మానాన్నలూ అడిగితే ‘బాపూ బొమ్మను తీసుకురండం’టూ బ్రాండొకటి చెప్పేవారు. అలాంటి పిల్లలే కావాలంటే ఎక్కణ్ణించొస్తారు? ఆఖరికి అదొక గోల్డ్ స్టాండర్డ్ అయి కూర్చుంది. ఇహ ఈ రవఁణున్నాడే! గొప్ప కబుర్లపోగు. ఏవో కథలూ గట్రా రాస్తూండేవాడు. ఆయనగారి మనంలో ఏఁవుందో ఈయనకి తెలిసిపోయేది. ఈయనగారి కలంలో ఏఁవుందో ఆయనకి అర్ధమైపొయ్యేది. 

బుడుగూ, సీగానపెసూనాంబ.... అనేసి రెండు పేర్లు అనుకుని ‘ఓం విఘ్నేశ్వరాయ’ అని ముందస్తుగా రాసి మొదలెట్టగానే ఈయనేసిన రెండు బొమ్మలూ రూపం తెచ్చేసుకున్నాయి. ఆనక వాళ్ళనాన్న గోపాళం, రాద, బాబాయ్, రెండుజెళ్ళసీత, పక్కింటి లావుపాటి పిన్నిగారు, ఆవిడ ముగుడు... అందరికన్నా అందంగా... వత్తులపెట్లో డబ్బులు దాచుకునే బామ్మ... వీళ్ళందరి బొమ్మలూ వేషాలేసుకుని పుస్తకమ్మీదకి వచ్చేశాయి. 

మనకింక తడుంకునే పన్లేదు. ‘బుడుగంటే ఎలావుంటాడూ?’ అని నీ బుర్రనీ, పుస్తకాన్నీ చించుకోవాల్సిన అవసరంలేకండా తాళ్ళలాగేసి, ఓ బుగ్గలబూరిగాణ్ణి మనముందు నిలబెట్టేశాడు.  రెండు కొత్తిమీర కట్టల్లాంటి జళ్ళేసి సీగాననీ లాక్కొచ్చేశాడు. వాళ్ళెంత నచ్చేస్తారంటే అందరూ చూస్తుండగా వందసార్లూ, ఎవరూ చూడకండా మరోవందసార్లూ పుస్తకాన్ని ముద్దెట్టేసుకునేంత!

వీళ్ళిద్దరితోనే అయ్యిందేఁవిటి?  ‘రామపట్టాభిషేకం పటం ఇంటోవుంటే శుభం! బాపూదయితే ఇంకా శుభం!’....
ఇది మన తెలుగింటి నానుడి! నేనన్నది అతిశయోక్తేమోగానీ అతిమాత్రం కాదు.
ఓమారు ఆ చివర్నించి ఈచివరిదాకా చూడండి...
సీతారాములేమో మొహమాటంగాను, లక్ష్మణ భరత శత్రుఘ్నులేమో ‘హమ్మయ్య! అన్నయ్యొచ్చేశాడు! ఇహ మనకేం ఫరవాలేద’న్నట్టుగాను, వసిష్టులవారేమో ‘ఈరోజుకోసం ఎన్నాళ్ళనించి చూస్తున్నానో తెలుసా రామా?’ అన్నట్టుగాను, ఇహ హనుమంతుడయితే ‘నాకోసఁవే అప్పుడాగిపోయింది పట్టాభిషేకం. నే లేననే! అదీ అదృష్టఁవంటే!’ అనుకునేంత గాఢభక్తితోను...
చూస్తూనే వుండిపోయి, చుట్టుపక్కలేం జరుగుతోందో కూడా మర్చిపోతావు. ఆ క్షణంలో ఓ అప్పారావొచ్చి ‘ఓ ఫైవ్ లాక్స్ అప్పిస్తావోయ్?’ అనడిగినా ఇచ్చిపడేస్తావ్! అంత విషయం వుందక్కడ!

ఈయన బొమ్మ వుందంటే పుస్తకానికి పసుబ్బొట్టు పెట్టినంత అందం. గుమ్మానికి మావిడాకు కట్టినట్టు, కొత్తబట్టలు కొనుక్కున్నట్టు పత్రికలవాళ్ళు పండగలన్నిటికీ ఈయన్నే వెయ్యమనేవారు ముఖచిత్రాన్ని.
అంతవరకూ ప్రతివారం వచ్చే వాణిశ్రీలూ, జమునలూ, జయప్రద, సుధ, చిత్రాలూ మాయమైపోయేవారు. వాళ్ళందరికన్నా అందంగా ఓ పిల్ల దిగేది. ఆ పుస్తకాన్ని లోపలి కథల కోసం కొందరూ, బయట బొమ్మకోసం కొందరూ ఏళ్ళతరబడి దాచుకునేవారు.
అమరావతి కథలకి ఈయన గీసిన బొమ్మల్ని చూసారా? సత్యంగారి ఆత్మ బాపు బొమ్మల్లో కనబడుతుంది. ఆయనేఁవనుకుని రాశాడో తెలీదుగానీ ‘రాగిచెంబులో చేపపిల్ల’, ‘భోజన చక్రవర్తి’, ‘ముద్దులల్లుడు’ కథలకి బొమ్మలొకసారి చూడండి. 

పుస్తకంలేదా మీయింటో? అదే మరి! మీరేం తెలుగువాళ్ళూ? కథని చదివి, జీర్ణం చేసేసుకుని, రక్తంలోకీ, మనసులోకీ ఎక్కించుకుని ఆనక బుర్రకి పనిచెప్పి ఓ బొమ్మగీస్తే.... కథంతా ఒక్క బొమ్మలో తెలిసిపోతుంది! అంత పనిమంతుడు మన బాపు! మిథునఁవైతే ఇహ లాభంలేదని ఏకంగా మొత్తం తన దస్తూరీలోనే రాసిపడేశాడు. ఒకసారి దూరంనించి చూస్తే పళ్ళెంలో పారిజాతాల్లా వుంటాయి అక్షరాలన్నీ!  ....ఏరి వాసన చూడాలన్నంత అందంగా!

ఎంతమందికో కథలకీ, నవలలకీ బొమ్మలేశాడు. సినిమా పుస్తకాల్లో రేలంగిరిజల్నీ, జమునాసావిత్రుల్నీ కళ్ళకి కట్టేసేవాడు.అంతర్జాతీయ స్థాయి అందాలబొమ్మల అపురూప చిత్రకారుడు...అమరలోకంలో రంభావూర్వశులు రోజూ వాళ్ళ బొమ్మలెయ్యమని సలపాదిస్తూ వుండేవుంటారు. తన బొమ్మల్ని చూస్తూ పెరిగాం. తన బొమ్మల్ని చూస్తుండగానే మనలనొదిలి వెళిపోయాడు. మనసులో ఆ బొమ్మ మాత్రం పదికాలాలపాటు పదిలంగా అలానే వుంటుంది. 
బాపూకి జయంతి నివాళులు!

By
en-us Political News

  
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.