దత్తన్నకు రిటైర్మెంట్.. ఇచ్చినట్లేనా.. ?
Publish Date:Jul 14, 2025
Advertisement
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే, రాజకీయ నియామకాలపై దృష్టిని కేంద్రీకరించారు. అందులో భాగంగా, నిన్న (ఆదివారం) వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నలుగురు ప్రముఖులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా, కేరళ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సి. సదానందన్ మాస్టర్, ప్రఖ్యాత చరిత్రకారిణి మీనాక్షి జైన్‌లు పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ అయిన వారిలో ఉన్నారు.అలాగే, ఈరోజు (సోమవారం) మూడు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు,లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను రాష్ట్రపతి నియమించారు. ఇందులో, గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక గజపతి రాజు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనూ, ప్రభుత్వంలోన, పలు హోదాల్లో పని చేశారు. అశోక్ గజపతి రాజు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్డీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో కీలక శాఖలు నిర్వహించారు.2014 లో విజయనగరం ఎంపీగా గెలిచిన ఆయన ప్రధాని మోదీ ఫస్ట్ కాబినెట్’ లో కేబినెట్ మంత్రి హోదాలో విమానయాన శాఖ నిర్వహించారు. ఇదే సమయంలో, ప్రస్తుతం హర్యానా గవర్నర్’గా ఉన్న బండారు దత్తాత్రేయ స్థానంలో ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్’ను ఆ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమించారు. దత్తాత్రేయ హిమాచల్’ ప్రదేశ్ 2019-21), హర్యానా (2021-25)గవర్నర్’గా మొత్తం ఏడేళ్లు సేవలు అందించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్’గా సుదీర్ఘ కాలం పని చేసిన దత్తాత్రేయ బీజేపీలోనూ పలు హోదాల్లో పని చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. వాజ్ పేయ్, మోదీ ప్రభుత్వాలలో మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్’గా ఉన్న ఆయన పదవీ కాలం ముగియటంతో ఇప్పుడు అక్కడ కొత్త గవర్నర్’ను నియమించారు.దీంతో.. ఇప్పుడు దత్తాత్రేయను మరో రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారా లేక 78 ఏళ్ల దత్తన్నకు రిటైర్మెంట్’ ఇస్తారా అనేది, చూడవలసి వుంది.ఇక.. రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా భావించే గవర్నర్ పదవిని చేపట్టిన వారిలో తెలుగువారు చాలా మందే ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల రాజ్‌భవన్‌లో తెలుగు వారు గవర్నర్లుగా ఆశీనులయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన ప్రముఖులు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకూ మొత్తం 20 మంది వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. అలాగే ఒడిశా, తమళినాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరితోపాటు తెలుగింటి కోడలుగా వచ్చి ఒకరు కూడా గవర్నర్లుగా పనిచేశారు. అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు.ప్రస్తుతం అశోక గజపతి రాజుతో సహా ముగ్గురు తెలుగు వారు, మూడు రాష్ట్రాల ప్రధమ పౌరులుగా గౌరవం అందుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/bandaru-dattatreya-39-201994.html





