రాజుకుంటున్న బనకచర్ల.. రేవంత్ వర్సెస్ సీఎం.. - కేంద్రం మౌనం
Publish Date:Aug 16, 2025
Advertisement
ఏపీ ప్రభుత్వం నిర్మించ సంకల్పించిన బనకచర్ల ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.. వృథాగా పోయే గోదావరి వరద జలాల్లో సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆ జలాలను మళ్లించేందుకు కార్యాచరణ రూపొందించింది. అయితే దిగువ రాష్ట్రమైన ఏపీ నిర్మిస్తామంటున్న ప్రాజెక్టుపై ఎగువ రాష్ట్రం తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్లతో ఎగువ రాష్ట్రాలకు నష్టమేంటని నిలదీశారు. అలాగే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో బనకచర్ల అంశం ఇప్పుడు మరోసారి హీటెక్కి హాట్ టాపిక్ గా మారింది. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డుకు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేవలం వరద వచ్చే రోజుల్లోనే నీళ్లు తరలించనుండటంతో గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదని భావిస్తోంది. రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దానికి నిధుల కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే చర్చించారు. బనకచర్ల ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం లేఖ రాసింది. అయితే బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్‌ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పు పడుతోంది. బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పంద్రాగస్టు వేడుకల్లో కౌంటర్ ఇచ్చారు. గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా దక్కించుకుంటామని నిక్కచ్చిగా చెప్పారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామన్నారు. అయితే సీఎం చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదనీ, సముద్రంలోకి వృథాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామనీ, అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటి? అని పరోక్షంగా తెలంగాణ సర్కార్‌కు ప్రశ్నలు సంధించారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా? అని నిలదీశారు. కాగా రాయలసీమను నీటితో సశ్యశామలంగా చేసేందుకు బనకచర్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే . అయితే దీనికి తెలంగాణ సర్కార్ నో చెప్పడంతో వివాదం రాజుకుంది. చంద్రబాబు మాత్రం రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పోలవరం నుంచి బనకచర్లకు నీరు అందిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరి చూడాలి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర నిర్ణయం ఎలా ఉంటుందో?
http://www.teluguone.com/news/content/banakacharla-dispute-betwooem-telugu-states-25-204328.html





