బ్రిటన్, సింగపూర్ లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు.. అంబరాన్నంటిన సంబరాలు
Publish Date:Jun 11, 2026
Advertisement
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ క్రేజ్ తెలుగురాష్ట్రాలు, ఇండియా ఎల్లలు దాటి పోయింది. ఆయనకు ఉన్న గ్లోబల్ రేంజ్ అని మరోసారి రుజువైంది. నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్ దేశాల్లో బాలకృష్ణ అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బ్రిటన్, సింగపూర్ లో జరిగిన భారీ ఈవెంట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాద్యమంలో హల్ చల్ చేస్తున్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి. బ్రిటన్ లోని లెస్టర్ నగరంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు కేక్ కటింగ్‌తో ప్రారంభమైభారీ కార్ ర్యాలీతో జరిగాయి. బాలకృష్ణ చిత్రపటాలు, ప్రత్యేక జెండాలతో అలంకరించిన లగ్జరీ కార్లతో లెస్టర్ వీధుల్లో బాలయ్య అభిమానులు నిర్వహించిన ఈ ర్యాలీ అందరినీ విశేషంగా ఆకర్షించింది. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన కల్చరల్ కార్యక్రమాలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకకు ప్రత్యేక శోభను తెచ్చాయి. అఖండ తాండవం నృత్య ప్రదర్శన హైలైట్ గా నిలిచింది. అలాగే సాంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కూడా అలరించాయి. ఇదే వేదికపై నందమూరి బాలకృష్ణకు అంకితమిస్తూ అభిమానులు స్వయంగా రూపొందించిన ఒక ప్రత్యేక గీతాన్ని విడుదలచేశారు. మరోవైపు సింగపూర్‌లో సైతం బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీమ్ జై బాలయ్య సింగపూర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. బాలకృష్ణ నటించిన 100కు పైగా సినిమాల సినీ ప్రస్థానాన్ని, వైవిధ్యాన్ని గుర్తుచేసేలా ప్రత్యేక ఆడియో విజువల్స్, ప్రదర్శనలను చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన శ్రీమతి తేజస్వి పొడపాటి మాట్లాడుతూ.. బాలకృష్ణ కేవలం వెండితెరపైనే కాకుండా, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మంది పేద రోగులకు ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ నిజమైన జన హృదయ నేతగా ఎదిగారని కొనియాడారు. విదేశీ గడ్డపై ఉంటూ కూడా మాతృభూమిని, తమ అభిమాన హీరో సామాజిక సేవలను గుర్తుంచుకుని ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు.
http://www.teluguone.com/news/content/balakrishnas-birthday-celebrations-in-britain-and-singapore-36-222524.html





