బాలయ్య.. రావయ్య..!
Publish Date:Mar 31, 2017
Advertisement
హిందూపురంలోనే ఇల్లు కట్టుకుంటా... ఎనీ టైమ్ మీకు అందుబాటులో ఉంటా.... ఏ సమస్య వచ్చినా క్షణాల్లో వాలిపోతానంటూ.... ఎన్నికల టైమ్‌లో హామీల వర్షం కురిపించిన నందమూరి బాలకృష్ణ... మెరుపు తీగలా మారారు. ఎమ్మెల్యే అయి మూడేళ్లవుతున్నా, హిందూపురంలో సమస్యలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. తమ సమస్యల్ని తీరిపోతాయన్న ప్రజల ఆశలు.... కల్లలవుతున్నాయి. కేవలం షూటింగుల మీదే శ్రద్ధ పెడుతూ, నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తా, హిందూపురాన్ని రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానన్న బాలయ్య మాటలు నమ్మి.... ప్రజలు అత్యధిక మెజారిటీతో పట్టం కట్టారు. కానీ చుట్టపు చూపుగా వచ్చి, ఏదో కొద్దిసేపు హడావిడి చేసి మెరుపు తీగలా మాయమైపోతున్న బాలయ్య తీరుపై జనం విసుగెత్తిపోయారు. బాలకృష్ణ... సినీ యాక్టర్ నుంచి ఎమ్మెల్యేగా మారి దాదాపు మూడేళ్లు గడిచిపోతున్నా... తమ బతుకులు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అసలు ఎప్పుడొస్తారో, తమ సమస్యలు ఎప్పుడు తీరుతాయోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నామంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ హామీ ఇచ్చిన బాలయ్య.... ఇప్పుడు అసలు కనిపించడమే లేదంటున్నారు. ఎన్నిక సమయంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన బాలయ్య... ఆ తర్వాత దాన్ని మర్చిపోయారని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా హిందూపురం మున్సిపాలిటీలోని 38 వార్డుల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉందంటున్న జనం....తాగునీటి సమస్యను పరిష్కరించడంలో బాలయ్య విఫలమయ్యారని అంటున్నారు. బాలకృష్ణ... హిందూపురంలో పర్యటించి, ఐదు నెలలు దాటిపోతోందని, తన తరపున ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇన్ఛార్జులను నియమించినా, వాళ్లంతా సెటిల్మెంట్లకే పరిమితమవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినా, కనీసం తమ సమస్యలను అసెంబ్లీలోనైనా ప్రస్తావిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. అసెంబ్లీకి కూడా సరిగా హాజరుకావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రారంభంలో ఓ రెండ్రోజులు సభకు వెళ్లిన బాలయ్య... ఆ తర్వాత అటువైపు చూడటమే మానేశారట. ఇప్పుడైనా బాలయ్య హిందూపురంలో పర్యటించి, సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/balakrishna-39-73547.html





