'బాబ్లీ' కథ వెనక రాజకీయ గాథ!

Publish Date:Mar 7, 2013

Advertisement

- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

 

"రెండు రాష్ట్రాల మధ్య స్థానిక పరిస్థితులనుబట్టి పరస్పరం స్వార్థాలు బలిసి ఉంటాయి కాబట్టి, నదీజల పరివాహక ప్రాంతాల పరిథిలో ఉన్న రాష్ట్రాల హక్కులకు సంబంధించిన చట్టాలు తగాదాల పరిష్కారానికి తోడ్పడవు. హక్కుల్ని సమానతా సూత్రం ఆధారంగా మాత్రమే నీటిపంపిణీకి సంబంధించిన తగాదాలు పరిష్కారం కావాలి. తగాదాలో ఉన్న రాష్ట్రాలు దేనికదే తన రాష్ట్రంలోని రెండు ప్రాంతాలమధ్యనే నీటి తగాదా వస్తే తానేం చేస్తుందో ఆలోచించుకొని, ఆ సూత్రాన్నే రెండు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కూడా వర్తింపచేసుకోవాలి''!

 

   - జస్టీస్ బట్లర్ (1930): అమెరికాలోని మసాచూసెట్స్ X కనేట్ కట్ రాష్ట్రాల మధ్య జలపంపిణీ వివాదంలో యిచ్చిన తీర్పు."నీటి తగాదాలు న్యాయస్థానాల తీర్పులతో సంతృప్తికరంగా పరిష్కారం కాజాలవు''

                    - బర్బర్ (1959): అంతర్జాతీయ జలతగాదాల చరిత్ర''

 

దొంగలుపడిన ఆరునెలలకు 'అవేవో' తెగ మొరగడం మొదలెట్టాయట! నదీజలాల పంపిణీ విషయంలో ఇరుగుపొరుగుతో సమస్యలను పరిష్కరించుకోవటంలో అంతూపొంతూ లేని తాత్సారానికి అలవాటుపడిన ఆంధ్రప్రదేశ్ పాలనావ్యవస్థల తంతు కూడా అలాగే రూపుదిద్దుకుంటూ వచ్చింది. ఎడారిభూముల్ని సహితం సస్యశ్యామలం చేసుకుంటున్న ఈ ఆధునిక కాలంలో కూడా ఇరుగుపొరుగు రాష్ట్రాలమధ్య నదీజలాల పంపిణీకి సంబంధించిన వివాదాలు పరిష్కారం కాకుండా ఏళ్ళువూళ్ళో గడిచిపోవటానికి ప్రధాన కారణం - పాలకపక్షాల మధ్య, పాలనా యంత్రాంగానికి దూరంగా ఉండే ప్రతిపక్షాల నాయకుల మధ్య పరస్పరం రాజకీయ ఎకవాక్యత కొరవడడమూ, జాతీయ దృక్పథం లేకపోతే మానె, కనీసం రాష్ట్ర రైతాంగ, సేద్యపునీటి అవసరాల పట్ల శ్రద్ధ లేకపోవటమూ! ఈలోగా, అవే కారణాలపైన ప్రాంతీయ తగాదాలు ముదురిపోవటమూ; ఈ తగాదాలకు దోహదం చేస్తున్న కారణాలలో రాష్ట్రాలమధ్య జలవివాదాలు ఒక భాగం కాగా, ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాలమధ్య జలపంపిణీ తాలూకు తగాదాలు ఎంతకూ ఒక కొలిక్కి రాకపోవటం మరో భాగం! ఈ లంపటంలో అంతర్భాగంగా ఇటీవల కాలంలో కొత్తగా తెలెత్తిన వివాదం మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తెలంగాణా ప్రాంతపు భూములకు సేద్యపునీటిని అందించవలసిన గోదావరిపైన మహారాష్ట్ర చడీచప్పుడు కాకుండా నిర్మించుకున్న బాబ్లీ ప్రాజెక్టు. తెలుగు 'సన్నాసులు' ప్రాంతీయ తగాదాల్లో 'మునగానాం-తీలానాం'గా ఉన్న సమయాన్ని కనిపెట్టి తెలివితో తేకువతో మహారాష్ట్ర పాలకులు అక్కడి రాజకీయ పక్షాలూ తెలుగువాడిని ఎక్కడ దెబ్బతీయాలో అక్కడనే తెలుగుజనాలకు జీవనాధారమైన నీటి అవసరాల మీదనే దెబ్బతీశారు! ప్రజాబాహుళ్యపు మౌలిక సమస్యలయిన తిండి, బట్ట, ఉపాథి, వసతి అవసరాలను ఈడేర్చడంపైన కేంద్రీకరించకుండా పనికిమాలిన పక్కదారులలోకి రాజకీయ నిరుద్యోగులు మళ్ళిపోవడంవల్లనే తెలంగాణాకు చెందిన అయిదారు జిల్లాలేగాక [ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు] కోస్తాంధ్రలోని గోదావరిజిల్లాలు కూడా సాగునీటి, మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవలసి వస్తుంది!


మహారాష్ట్ర నిర్మించిన ఈ బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణస్థలం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ లోని శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు ఉన్న బ్యాక్ వాటర్ స్థలంలోనే ఉంది. శ్రీరాంసాగర్ గోదావరి నదిపైన మనం కట్టుకున్న తొలి సాగునీటి ప్రాజెక్టు. శ్రీరాంసాగర్ నిర్మాణ సమయంలో ఈ బ్యాక్ వాటర్ ఉన్న భూమిని మనం డబ్బిచ్చి కొనుకున్నదేగాని ఎవడూ ఉచితంగా దానం చేసిందికాదు! అయినా, "చూస్తూ ఉంటే మేస్తూ పోయిందన్న'' సామెతలా, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాడుకోవలసిన నీటి కేటాయింపు పరిథిని అధిగమించి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని శ్రీరాంసాగర్ పరిథిలోని బ్యాక్ వాటర్ స్థలంలో తలపెట్టింది! అయినా మన రాజకీయ నిరుద్యోగులకూ పాలకులకూ ఇది పట్టలేదు. ఇది రెండు రాష్ట్రాలమధ్య సమస్యకు దారితీసింది. అసలు అటు కృష్ణా జలాల పంపిణీకి చెందిన బచావత్ ట్రిబ్యునల్ గాని, ఇటు గోదావరి జలాల నిర్థారణకు సంబంధించిన ట్రిబ్యునల్ గానీ ఆంధ్రప్రదేశ్-కర్నాటక, ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలమధ్య జలసమస్యలను తమ ఓపాన శక్తికొలదీ పరిష్కరించడానికి ప్రయత్నించాయి. కాని వచ్చిన చిక్కు అంతా అటు పాలకపక్షాలుగానీ, ఇటు ప్రతిపక్షాలుగానీ పరస్పరం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా జలసమస్యల్ని పట్టించుకోకుండా చూస్తూ వచ్చాయేగాని రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పరిశీలించకపోవడం వల్లనే వచ్చిపడింది. రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లో సాగునీటి ప్రాజెక్టులపై తీసుకున్న పాటి శ్రద్ధను తరువాత వచ్చిన పాలకపక్షాలు [ఒక్క ఎన్టీఆర్, వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాలనలలో మినహాయించి] చూపలేదు! పైగా కృష్ణాజలాల విషయంలో కర్నాటక, గోదావరి జలాల వినియోగం విషయంలో మహారాష్ట్ర పాలకులు తమ రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించుకున్నంతగా మన రాష్ట్రపాలకులూ, ప్రతిపక్షాలూ శ్రద్ధ వహించకుండా ఎంతసేపూ పనికిమాలిన స్పర్థలతోనే కాలక్షేపం చేస్తూ వచ్చారు. 'సందట్లో సడేమియా' అన్నట్టు, కాగల కార్యాన్ని కాస్తా ఆల్మట్టి విషయంలో కర్నాటక, 'బాబ్లీ' విషయంలో మహారాష్ట్ర పాలకులు "గంధర్వులై'' గుట్టుచప్పుడు కాకుండా నెరవేర్చేశారు!

 

ఆంధ్రప్రదేశ్-మహారాస్ష్ట్రలమధ్య కుదిరిన 1955 నాటి ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణాన్ని తలపెట్టినప్పటికీ గోదావరి జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 60 శతకోటి ఘనపుటడుగుల నీటిని తన ప్రాజెక్టులకు వాడుకునే హక్కు మహారాష్ట్రకు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు జలాశాయంలోనే రహస్యంగా మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మించడం తీవ్రమైన ఉల్లంఘన. ఈ ఉల్లంఘనకు కేంద్రప్రభుత్వ జలవనరుల సంఘం కూడా అభ్యంతరం చెప్పింది; తీరా చేతులు కాలిన తరువాత ఆంధ్రప్రదేశ్ పాలకులు గుడ్లు అప్పగించి చూస్తుండిపోవటమేగాక, ప్రాంతీయ తగాదాల్లో మునిగిపోయిన రాజకీయ నిరుద్యోగ నాయకులూ ఇటీవల కాలంలోనే ఇందుకు కారకులు.

 


మహారాష్ట్ర పూర్తి చేసుకున్న 12 బాబ్లీగేట్ల నిర్మాణాన్ని, నేను సలహాదారుగా పనిచేసిన ఓకే దినపత్రిక సీనియర్ పాత్రికేయులయిన ఎం.ఎస్.సి.హెచ్. బాబ్జీ రహస్యంగా మారువేషాల్లో వెళ్ళి బాబ్లీ కథ ముగిసిన వైనాన్ని సాధికారికంగా ఫోటోలతోసహా అయిదారు రోజులపాటు వార్తాకథనాన్ని రాష్ట్రప్రజలకు వెల్లడించేదాకా తగాదాల్లో ఉన్న తెలంగాణాప్రాంత నాయకులు ఒక్కరూ నోరెత్తకపోవటం మరో విశేషం! ఈ విషయంలో మిగతా రాష్ట్ర రాజకీయ నాయకులూ "నిమ్మకునోరెత్తినట్టే'' కూర్చున్నారు! అంతకుముందే విషయం తెలిసిన ఆనాటి "తెలుగుదేశం'' ప్రభుత్వం ఏమీ ఎరగనట్టే బయటకు పొక్కనివ్వలేదు. తరువాత విషయాన్ని గ్రహించిన వై.ఎస్.ప్రభుత్వం సుప్రీంకోర్టు జోక్యాన్ని అర్థించింది. ఆ పిమ్మట సుప్రీంకోర్టు తాత్కాలిక 'స్టే'ద్వారా బాబ్లీ నిర్మాణపనుల్ని వివాదం తేలేవరకూ తాత్కాలికంగా ఆపుచేయించింది. కాని ఫిబ్రవరి (2013)లో సుప్రీమ్ ఉభయపక్షాల వాదనలను విన్న తరువాత బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్రకు గోదావరి జలాల్లో నిర్ణయించిన 60 శతకోటి ఘనపుటడుగుల నీటిని ఆ రాష్ట్రం వాడుకోడానికి గల హక్కును గుర్తిస్తూనే మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక షరతు విధించి, ఆ షరతు అమలు జరిగేట్టు చూసే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి సహా ముగ్గురు ఉన్నతస్థాయి సభ్యులతో కూడిన పర్యవేక్షక సంఘానికి అప్పగించింది. దీని ప్రకారం బాబ్లీ బరాజ్ నిర్వహణ తీరును ఈ సాధికార సంఘం పరిశీలిస్తూ 60టి.ఎం.సి. నీటి కేటాయింపులో బరాజ్ వద్ద నీటినిల్వ (కెపాసిటీ) సామర్థ్యాన్ని 2.74 టి.ఎం.సి.కి ఎట్టిపరిస్థితుల్లోనూ మించకుండా చూడాలని సుప్రీమ్ ఆదేశించింది. అయితే, శ్రీరాంసాగర్ జలాశయం భూభాగంలో అక్రమంగా నిర్మించిన బాబ్లీ కట్టడాన్ని తొలగించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినతిని మన్నించకపోవడం విచారకరం. అందుకే రెండు రాష్ట్రాలమధ్య నదీజల పంపిణీ వివాదాలను సామరస్యంతో ఆయా ప్రభుత్వాలను నిర్వహించే పాలకులు పరిష్కరించుకోవాలి గాని కోర్టులు పరిష్కరించజాలవు.

 

ఇందుకు ఉదాహరణలు - ఆల్మట్టి నిర్మాణం విషయంలో (కృష్ణా జలాల పంపిణీ)  బరాజ్ ఎత్తును ఆంధ్రప్రదేశ్ కోరికమేరకు నిర్దిష్టు పరిమితికి మించి పెంచరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని కర్నాటకలోని హెగ్డే, దేవెగౌడ ప్రభుత్వాలు, బాబ్లీ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వమూ తుంగలో తొక్కాయి. అసలు ఈ తొక్కిసలాటకంతకూ ప్రధాన కారణం - నదీజలాల వినియోగం విషయంలో పాలకులకు జాతీయ దృక్పధంకన్నా సంకుచితమైన వైఖరీ, ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలమధ్య దామాషాన పంపిణీ కావలసిన ఉమ్మడి జలరాశి విషయంలో ఎవరికీ వారికి ఉమ్మడి రాష్ట్రప్రయోజనాల పట్ల సమగ్రమైన దృక్పధం బొత్తిగా కొరవడటమూ! రాజకీయ నిరుద్యోగులు ప్రజలపేరిట ప్రజలపైన తమ స్వార్థంకొద్దీ ఉద్యమాలవల్ల మొత్తం రాష్ట్రప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. బాబ్లీ విషయంలో దాదాపుగా అందరూ దొంగలే, నంగనాచులే, కొంగజపాలరాయుళ్ళే! మనకు ధర్మరాజులకన్నా శకునులు ఎక్కువైపోయారు! మన రాష్ట్ర చిత్రపటం ఇలా తగలడబట్టే ఏనాడో, దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికే, ఆ తరవాతి దశలో కూడా దశాబ్దాలక్రితం శొంఠి రామమూర్తి యావదాంధ్రుల (తెలుగువారి)కోసం రూపకల్పన చేసిన రామపాదసాగర్ ప్రాజెక్టు ఈ రోజుకీ పోలవరం ప్రాజెక్టుగా పూర్తిగా ప్రాణం పోసుకోలేకపోతుంది!


కొంతమంది తెలివితక్కువ ప్రాంతీయవాదులు పోలవరాన్ని తెలుగుప్రాజెక్టుగా భావించుకోలేక పోతున్నారు; కృష్ణా, గోదావరులు సేద్యపునీరుగా, తాగునీరుగా యావత్తు తెలుగుప్రజల అనుభవంలోకి రావలసిన బృహత్ నిర్మాణాన్ని జలరాశిగా భావించుకొనక పోవడంవల్లనే ఎటా లక్షలాది క్యూసెక్కుల నీరు శిశువుకు దక్కని తల్లిపాలలా సముద్రం పాలవుతున్నా రాజకీయ స్వార్థం బలిసిపోయి కించిత్తు బాధను కూడా వ్యక్తం చేయలేకపోతున్నారు! ఇలా బలిసిపోయిన నిరాసక్త ధోరణి వల్లనే తెలంగాణాలోని రాజోలిబండకు సహితం ఉపయోగపడగల కృష్ణనీటికి గండికొట్టేందుకు కర్నాటక పన్నిన కుట్రలో భాగంగా తుంగభద్ర నోర్డును (ఇది ఆంధ్రప్రదేశ్-కర్ణాటకల సంయుక్త మండలి) కర్నాటక ప్రభుత్వం ఏకపక్షంగా నర్మగర్భంగా రద్దు చేయబోయినప్పుడు కూడా నేటి వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు సహా రాష్ట్రనాయకులెవరూ నోళ్ళు విప్పలేక పోయారు!


అప్పుడు కూడా నేను ఒక ప్రముఖ దినపత్రికకు సంపాదకునిగా ఉన్నప్పుడు విశ్వేశ్వర్రావు (అనంతపురం)లాంటి సీనియర్ పాత్రికేయ మిత్రులద్వారా మొదటిసారిగా పెద్దస్థాయిలో ఆ కుట్రను బహిర్గతం చేస్తూ వార్తా కధలు ప్రచురించాల్సి వచ్చింది' అలాగే ఇటీవల కాలంలోనూ మరొక పత్రికద్వారా పాత్రికేయ మిత్రులను రహస్యంగా బాబ్లీకి పంపించి మొట్టమొదటిసారిగా తిరుగులేని దృశ్యమాలికల ద్వారా "బాబ్లీ కథకు తెరదించిన మాయల మరాఠీ'' అన్న మకుటంతో [19-06-2010 నుంచి 26-07-2010 దాకా] ప్రముఖంగా ఏడు వార్తాకథనాలు ప్రచురించాల్సి వచ్చింది. అంతవరకూ సాగుతున్న తంతును ఆ వార్తలో యిలా నమోదు చేయవలసివచ్చింది:


"రాష్ట్రం తెలంగాణా ఉద్యమ ఆందోళనలు, అల్లర్లతో అట్టుడికిపోతున్న సమయంలో మహారాష్ట్ర గుట్టుచప్పుడు కాకుండా తనపనిని పూర్తీచేసుకుని మనల్ని 'వెవ్వెవ్వ' అంటూ వెక్కిరించింది. మహారాష్ట్ర నిర్వాకంతో ఒక్క తెలంగాణా మాత్రమే కాకుండా అన్నపూర్ణగా పిలుచుకునే ఉభయగోదావరి జిల్లాలు సహా గోదావరిజలాలపైన ఆధారపడిన జనావాసాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని పారిశ్రామిక వాడలూ తీవ్ర సంకటస్థితిని ఎదుర్కోనున్నాయి. మహారాష్ట్రకు దిగువన గోదావరినదిపై ఉన్న నీటిప్రాజెక్టులకు ఇక ఇసుకతిన్నెలే గతి. అక్కడ పూర్తయింది బాబ్లీ ప్రాజెక్టు కాదు, నేలకూలిన తెలుగుప్రజల ఆత్మగౌరవం ... అన్ని రాజకీయపార్టీలూ దీన్ని జలరాజకీయం చేసి ప్రయోజనం పొందాయే తప్ప ఈ దారుణాన్ని ఆపలేకపోయాయి, నిర్మాణాన్ని నిలపలేకపోయాయి''

అంతేగాదు, పాత్రికేయుడు బాబ్జీ ఈ బాబ్లీ గాథను వెలికితీయడానికి పడినశ్రమనూ, ఎదుర్కొన్న కష్టాలను కూడా ఆ నివేదికలోనే ఇలా వెల్లడించం :


"సుప్రీంకోర్టు చెప్పనున్న తీర్పుతో ఇక ఇప్పుడు కొత్తగా ఒరిగేదేమీ కనిపించడం లేదు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన ఈ ప్రత్యేక ప్రతినిధికి కళ్ళు తిరిగే దృశ్యాలు కనిపించాయి. ఇప్పటివరకూ రెండు కిలోమీటర్ల దూరం నుంచే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ వ్యక్తి అయినా ఫోటోలు తీయగలిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క పురుగును కూడా అనుమతించని మరాఠా పోలీసులు ప్రాజెక్టు కాంట్రాక్టర్ గూండాలు, 'బాబ్లీ పరిరక్షణ సమితి' కళ్ళు కప్పి ఎన్నో వ్యయప్రయాసల కోర్చాల్సివచ్చింది. అక్కడకు చేరుకున్న తర్వాత, ప్రారంభోత్సవానికి పెళ్ళికూతురులా ముస్తాబయి కూర్చున్న బాబ్లీ ప్రాజెక్టు దర్శనమిచ్చింది. ఈ ప్రాజెక్టును చేరుకోడానికి అడుగడుగునా సోదాలు, గూండాల నిలవరింతలు, గ్రామస్తుల నిలదీతలు ఈ ప్రత్యేక ప్రతినిధికి లభించాయి. ఒక దశలో ఈ ప్రతినిధి ప్రాణాలకు కూడా తెగించాల్సి వచ్చింది. స్థానికంగా పరిచయమైనా ఇద్దరు మరాఠీ మిత్రులతో కలిసి తెలుగు మాట్లాడకుండా జాగ్రత్తపడుతూ బాబ్లీని చేరుకోవాల్సి వచ్చింది. బోధన నుంచి సాలూర,మహారాష్ట్రలోని బిలాని నుంచి అర్జాపూర్ మీదుగా షేర్ గావ్, కొండల్ వాడికి చేరుకున్నాం. అక్కడినుంచి గ్రామస్తులతో కలసి వారి వేషభాషలతోనే బాబ్లీ ప్రాజెక్టుకు కాలినడకన చేరాల్సివచ్చింది ... 2.70 టి.ఎం.సి.ల నీటి సామర్థ్యాన్ని మించేలా గేట్లు గనుక దించితే మరికొన్ని వందల టి.ఎం.సి.ల నీరు నిల్వ అయ్యేలా వేలాది ఎకరాల భూమిని సిద్ధం చేశారు. ముంపునకు గురి అయ్యే గ్రామాలను తరలించేశారు. నిర్మాణం పూర్తికావడంతో నిర్మాణ సామాగ్రి యంత్రాలు, వాహనాలను తరలించేశారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలమైనా, ప్రతికూలమైనా తమ ప్రయత్నం సఫలమయిందని కోర్టుతీర్పు ఏవిధంగా వచ్చినా ఫర్వాలేదనీ బాబ్లీ పరిరక్షణ సమితి సభ్యుడొకరు చెప్పారు. నిర్మాణం ఆగిపోయిందనే భ్రమలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది తిరుగులేని షాక్. సింగూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు హైదరాబాద్ మంచినీటి సరఫరాకు అంకితమైంది. కాగా బాబ్లీ నిర్మాణంతో శ్రీరాంసాగర్ ఎడారికానుంది. ఇక రాష్ట్రంలో రూ.200 కోట్ల వ్యయంతో అత్యంత ఆర్భాటంతో ఆరంభించిన ఆలీసాగర్ ఎత్తపోతల పథకం నీరు రాక వెక్కిరిస్తోంది. జలయజ్ఞానికే తలమానికంగా భావించిన ఈ ఎత్తిపోతల పధకాన్ని బాబ్లీ పూర్తిగా కబళించివేసింది'' [19 జూన్ 2010]!


ఇలా పాలకపక్షాలలో, ప్రతిపక్షాల్లో ఉన్న స్వార్థపర రాజకీయ నిరుద్యోగుల మూలంగా రాష్ట్ర సేద్యపు నీటి ప్రాజెక్టులు ఎన్నింటినో నిర్మించుకోలేక రైతాంగమూ, సాధారణ ప్రజాబాహుళ్యమూ ఎంతగానో ఇన్నేళ్ళుగా నష్టపోతూ వచ్చారు. నేటి బాబ్లీ విషయంలో మాదిరే మిగతా ప్రాజెక్టుల విషయంలో కూడా పాలక, ప్రతిపక్షాలలోని రాజకీయ నిరుద్యోగుల మధ్య ఎకవాక్యత లేకపోవడంవల్ల పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మరింత చులకనైపోయాం! దానికితోడు కృష్ణ, గోదావరి నదుల్లో పారే జలరాశిలో నిక్కచ్చిగా ఆధారపడదగిన (డిపెండబిలిటీ) మొత్తాన్ని అంచనా వేయడంలో లోపం ఉందని భ్రమకు లోనుకారాదనీ డాక్టర్ కె.ఎల్,రావు లాంటి సుప్రసిద్ధ ఇంజనీర్లు కూడా అభిప్రాయపడుతూ వచ్చారు. అలాగే, ప్రాజెక్టులు తలపెట్టడంలో జాప్యంవల్ల కొన్నాళ్ళు, తలపెట్టిన తర్వాత ప్రారంభంకాక కొన్నాళ్ళు, ప్రారంభించిన తర్వాత సకాలంలో నిర్మాణం పూర్తికానందువల్ల తడిసిమోపెడైన ఖర్చులవాళ్ళ కొన్నాళ్ళు గడిచిపోవడం వల్ల కూడా రాష్ట్రంలో ప్రాంతాల మధ్య తగాదాలు తలెత్తడమూ జరిగింది. అలాగే నదులలో "అదనపు జలరాశి'' అన్నది ఒక మిథ్యగా తయారవడం వల్ల, ఆ ''మిథ్య'' ఆధారంగా ట్రిబ్యునళ్ళు రాష్ట్రాల మధ్య జలపంపిణీని నిర్ణయించడం వల్ల కూడా ఆచరణలో సమస్యలు తలెత్తుతూ వచ్చాయని మరచిపోరాదు.


అలాగే కేంద్ర వాటర్ కమీషన్ చీఫ్ ఇంజనీరు, తుంగభద్ర బోర్డు చైర్మన్ గా పనిచేసిన గాడ్ బోలే అంచనా ప్రకారం "మన దేశంలో దాదాపు ఏ ప్రాజెక్టు కిందా మనం ఇసుకమేటలు సకాలంలో తొలగించిన పాపాన పోలేదు''! అందుకే ఈ రోజుకీ అటు ఉత్తరాంధ్రలోని వంశధార రెండవ దశగానీ, ఇటు తెలంగాణాలోని శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు రెండవదశగానీ పరిపూర్తి కాకపోవడానికి కారణం ప్రాంతాలమధ్య వివక్షవల్ల కాదు, పాలనావ్యవస్థల ముందుచూపులేని విధానాలవాళ్ళ మాత్రమే! అందుకే మూడుప్రాంతాలలోని చిన్నవీ, మధ్యరకం, భారీ నీటిపథకాలు నిర్మాణం కోసం, ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నవీ ఎన్నో ఉన్నాయి. వేర్పాటు ఉద్యమాలే మౌలిక సమస్యలను పరిష్కరించజాలవు. సమస్యల మూలాలలోకి, పెట్టుబడీదారీ విధానాల తీరుతెన్నులలోకి వెళ్ళి పరిశీలించకుండా గావుకేకల వల్ల ప్రయోజనం శూన్యం! ఇది నేటి మాటే కాదు, హెచ్చరికగా రేపటి మాట కూడా. కులాసా కబుర్లనుంచీ, విలాసక్షేత్రాలనుంచీ (ఫామ్ హౌసెస్) నీరు పారదు, కనుకనే పాలనా విధానాల, ఉత్తుత్తి ఉద్యమాల తీరూమారదు!

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.