బయటపడుతున్న రాందేవ్ "పతంజలి" బండారం
Publish Date:Jul 5, 2016
Advertisement
ఎఫ్ఎంసీజీ రంగంలో దిగ్గజ సంస్థలకు పోటీనిస్తున్న యోగా గురు రాందేవ్ బాబా కంపెనీ "పతంజలి"కి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశీయ వాణిజ్య ప్రకటనల్లోని తప్పొప్పులను పరిశీలించే "అడ్వర్టయిజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా" పతంజలికి మొట్టికాయలు వేసింది. పతంజలి బ్రాండ్‌తో ఇటీవల విడుదల చేసిన "దంత్ కాంత్" టూత్‌పేస్టుకి అంత మ్యాటర్ లేదని తేల్చింది. వాపు, చిగురుల నుంచి రక్తం కారడం, పళ్లు పసుపు రంగులోకి మారడం, సెన్సిటివిటీ, చెడు వాసన లాంటి సమస్యలకు "దంత్ కాంత్" బాగా పనిచేస్తుందనేది నిరూపించడబలేదని కౌన్సిల్ స్పష్టం చేసింది. దీనిని మార్కెట్‌లోకి విడుదల చేసే ముందు ఇచ్చిన వాణిజ్య ప్రకటనలో క్రిములు, సూక్ష్మజీవుల నుంచి పళ్లను రక్షిస్తుందని తెలిపారని, కానీ దానికి తగ్గ రీతిలో ఇది పనిచేయడం లేదని పేర్కొంది. ఈ ప్రకటన ద్వారా ప్రజలను మోసం చేయడమేనని ఎఎస్సీఐ స్పష్టం చేసింది. ఈ ఒక్క ప్రకటన పైనే కాదు పండ్ల రసాలు, పశువుల దాణా ప్రకటనలను కూడా ఆక్షేపించింది. పతంజలికి ఎఎస్సీఐ నుంచి ఆక్షింతలు పడటం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు పతంజలి "కచ్చీ ఘనీ మస్టర్డ్ ఆయిల్", "కేశ్ కాంతి న్యాచురల్ హెయిర్ క్లెన్సర్" పేరుతో ఆవనూనె, హెయిర్ ఆయిల్ మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఆవనూనెపై దేశవ్యాప్తంగా ఉన్న నూనె వ్యాపారులు గగ్గోలు పెట్టడంతో రంగంలోకి దిగిన ఎఎస్సీఐ వారి నుంచి వచ్చిన 156 ఫిర్యాదులపై విచారణ జరిపింది. కోల్డ్ ప్రాసెస్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవనూనె రుచి బాగుండదని పతంజలి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసి..ఇతర సంస్థల ఉత్పత్తులను ఉద్దేశ్యపూర్వకంగా తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. పోనీ పతంజలిలో ఎమైనా గొప్పతనం ఉందా అంటే అదీ లేదని ఎఎస్సీఐ తేల్చింది. ఇదిలా ఉంటే "దుగ్థమృత్" పేరుతో ఫ్రూట్ జ్యూస్‌ను మార్కెట్‌లోకి వదిలిన పతంజలి దీనిపైనా విమర్శలను మూటకట్టుకోవాల్సి వచ్చింది. మళ్లీ తన విలువను పెంచుకోవాడానికి "ఖరీదైన శీతల పానీయాల్లో గుజ్జు తక్కువగా ఉంటుంది" అని, తన పానీయాల్లో గుజ్జు అధికమంటూ ప్రకటనలూ జారీ చేసింది. కానీ ఏఎస్సీఐ పరిశీలనలో "దుగ్థమృత్"లో వాడిన దినుసుల విషయమై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోలేకపోయింది. ఇలా మార్కెట్‌లోకి పతంజలి విడుదల చేస్తోన్న ఉత్పత్తులు ప్రమాణాలకు విరుద్దంగా ఉంటున్నా.. దానిని కప్పిపుచ్చుకోవడానికి పతంజలి ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పతంజలి ఉత్పత్తి చేస్తోన్న అన్ని రకాల ఉత్పత్తులను పరీక్షించాలని ఎఎస్సీఐ, ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/baba-ramdev-45-63440.html





