పతంజలికి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
Publish Date:Jul 3, 2025
                                     Advertisement
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. డాబర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు, పతంజలి ప్రకటనలు నిరాధారమైనవని పేర్కొంది. డాబర్ రూ. 2 కోట్లు పరిహారం కోరింది. పతంజలి సంస్థ తమ ఉత్పత్తుల్లో ఎక్కువ ప్రజాదరణ కలిగిన ఒకదాని గురించి అవమానకరమైన ప్రకటనలను నిర్వహిస్తోందని ఆరోపిస్తూ డాబర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మినీ పుష్కర్ణ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయుర్వేద, శాస్త్రీయ గ్రంథాల ఆధారంగా చ్యవన్‌ప్రాష్‌ను తయారు చేసిన ఏకైక సంస్థ తమదేనని, డాబర్ వంటి ఇతర బ్రాండ్‌లకు ప్రామాణికమైన జ్ఞానం లేదని, అవెలా తయారు చేయగలవని యాడ్స్‌ను పతంజలి రూపొందించింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పతంజలి తమ ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణం వాటిని నిలిపివేయాలని ఆదేశాలివ్వాలని కోరింది. తాము మార్గదర్శకాలను అనుసరించే ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, పతంజలి రూపొందించిన యాడ్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వివరించింది.దీనిపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పతంజలి యాడ్స్‌ను తక్షణం నిలిపేయాలని, తదుపరి విచారణ జూలై 14కి వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/baba-ramdev-25-201187.html




 
