బాబు కేబినెట్ లోకి అయ్యన్న, ఆర్ఆర్ఆర్?.. విస్తరణలో అవకాశం ఖాయమన్న ప్రచారం
Publish Date:Jul 28, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ విస్తరణకు సమాయత్తమౌతున్నారన్న చర్చ గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. అయితే కేవలం విస్తరణే కాదనీ, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనీ అని తెలుగుదేశం కూటమి వర్గాలు అంటున్నాయి. కొందరికి ఉద్వాసన, కొత్తవారికి అవకాశం ఉంటాయని అంటున్నారు. ఇందుకు తగినట్లుగానే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న కొందరు మంత్రుల పెర్ఫార్మెన్స్ అంటే పనితీరుపై చంద్రబాబు కొన్ని సందర్భాలలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పని తీరు మెరుగుపరచుకోకుంటే ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ కేబినెట్ విస్తరణ| పునర్వ్యవస్థీకరణ అంశం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రస్తుతం కేబినెట్ మంత్రులుగా ఉన్న వారిలో ఔట్ అయ్యేదెవరు? ఎందుకు వీళ్ళ పర్ఫామెన్స్ పూర్ గా ఉంది అన్న చర్చ ఆరంభమైంది. ప్రస్తుత కేబినెట్ లో కొందరు మంత్రులు ఇప్పటికీ వారి వారి శాఖలపై గ్రిప్ లేదని అంటున్నారు. అంతే కాకుండా, ప్రత్యర్థి పార్టీల నాయకులు ఈ మంత్రులను ఓ ఆట ఆడుకుంటుంటే.. వారిని కట్టడి చేయడంలో కూడా ఈ మంత్రులు పూర్తిగా ఫెయిల్ అయ్యారంట. ఎంత సేపూ మంత్రిగా ఆడంబరాలు, ఆర్భాటాలతో నన్ను చూడు, నా కారు సోకు చూడు అన్నట్లుగా సైరన్ కారులు వేసుకొని తిరగటం తప్ప, చేస్తుంది ఏమీ లేదన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు ఉన్న స్పీకర్ ,డిప్యూటీ స్పీకర్లను మంత్రులుగా ప్రమోట్ చేసే అవకాశా లున్నాయని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు తెలుగుదేశం, తెలుగుదేశం కూటమిలో గళాన్ని బలంగా వినిపించిన ఈ ఇద్దరినీ రాజ్యాంగ పదవుల పేరుతో గొంతు నొక్కేసి నట్లైందన్న అభిప్రాయం పార్టీ సీనియర్లలోనే వ్యక్తం అవుతోందంటున్నారు. 2019 - 24 మధ్య కాలంలో అప్పటి జగన్ ప్రభుత్వాన్ని నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నించి కడిగిపారేయడంతో ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజు ముందు వరుసలో నిలుస్తారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు.. అప్పట్లో తన వాగ్ధాటితో జగన్ నే టార్గెట్ చేస్తూ తన చేసిన ప్రసంగాలు వైసీపీ సర్కార్ పై ప్రతికూల పవనాలు వీచడానికి దోహదపడ్డాయి. అలాగే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజు.. గతంలో తన రచ్చబండద్వారా జగన్ అరాచకాలను, జగన్ ప్రభుత్వ దురాగతాలనూ ఉతికి ఆరేసేవారు. అప్పట్లో వైసీపీలో ఎంపీగా ఉండి ఆ పార్టీ, ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల ముందు పెట్టడంలో రఘురామకృష్ణంరాజు అత్యంత కీలక భూమిక పోషించారు. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు, విమర్శలకు బెంబేలెత్తిపోయిన అప్పటి జగన్ సర్కార్ ఆయనను రాష్ట్రంలో అడుగుపెట్టకుండా నిరోధించింది. అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు కూడా పాల్పడింది. అయినా వెరవకుండా ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా ఢిల్లీలో ఉండే జగన్ సర్కార్ అరాచకాలను రోజూ తూర్పారపట్టేవారు. అలాంటి రఘురాం కృష్ణంరాజుకు సహజంగానే టిడిపిలోకి రాగానే ,ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రి పదవి వస్తుందని రఘురామకృష్ణంరాజు, ఆయన అభిమానులే కాదు.. తెలుగుదేశం కూటమి పార్టీల శ్రేణులు కూడా భావించాయి. ఆయనమంత్రిగా ఉంటే.. జగన్ హయాంలోని ఆర్థిక అరాచకత్వం, ఆ సమయంలో జరిగిన అవినీతి లెక్కలన్నీ బయటకు తీసి జగన్ కు చుక్కులు చూపిస్తారని భావించారు. అయితే సమీకరణాలు కుదరకో, మరోటో.. కారణాలేవైతేనేం.. చంద్రబాబు కేబినెట్ లో అయ్యన్నపాత్రుడికి కానీ, రఘురామకృష్ణం రాజుకు కానీ స్థానం లభించలేదు సరికదా, గట్టిగా గొంతెత్తే అవకాశం లేని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు దక్కాయి. ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రావడం, కొందరు మంత్రులపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అసంతృప్తి వ్యక్తం చేయడంతో కేవలం ఖాళీగా ఉన్న ఒక్క స్థానాన్ని భర్తీ చేయడానికి మంత్రివర్గ విస్తరణ చేపట్టడం కాకుండా.. కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని చంద్రబాబు భావిస్తున్నారన్న వార్తలు వినవస్తుండటంతో మళ్లీ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రఘురామ కృష్ణంరాజులకు కేబినెట్ బెర్త్ అంశం తెరమీదకు వచ్చింది. ఈ విషయంపై ఏదైనా ఉప్పం దిందో ఏమో తెలియదు కానీ రఘురామకృష్ణంరాజు ఇటీవల తన అమెరికా పర్యటనలో తన మనసులోని భావాలను అక్కడి వారితో పంచుకుంటూ.. తనకు హోం మంత్రి, లేదా ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేయాలన్న ఆశ ఉందని బయట పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ ఖాయమని జరుగుతున్న ప్రచారం ఒకవైపు, మరోవైపు ఈ ఇద్దరు సీనియర్లు క్యాబినెట్ లోకి వస్తే టిడిపి వాయిస్ మరింత బలపడుతుందన్న ప్రచారం మరోవైపు కూటమి పార్టీల్లో జోరుగా సాగుతుంది..... అయ్యన్నపాత్రుడు, రఘురాం కృష్ణంరాజులు క్యాబినెట్ లోకి వస్తే.. రాజకీయంగా అది టిడిపికి మరింత బలాన్ని చేకూరుస్తుందని, వైసీపీయుల అనుచిత వ్యాఖ్యలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పగలుగుతారని తెలుగుదేశం వర్గాలు కూడా భావిస్తున్నాయి. సరే ఈ ప్రచారం సంగతి పక్కన పెడితే అసలు ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో మంత్రులు ఎందుకు గొంతు ఎత్తలేకపోతున్నారనేది మరొక ప్రశ్న.. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తమతమ శాఖలకు సంబంధించిన అంశాలలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చారు. అయినా మంత్రి హోదా అనుభవిస్తూ కూడా.. వైసీపీ నేతల విమర్శలు, వ్యాఖ్యలకు దీటుగా బదులు ఇవ్వకుండా మౌనం వహిస్తుండటం. అలాగే ప్రజలతో మమేకం కాకపోవడంతో కొందరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సీఎం అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా సొంత వ్యాపారాల కోసం వైసీపీ నేతలతో కుమ్మక్కయాన్న అనుమానాలు కూడా అడపాదడపా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. త్వరలో జరగనున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనలూ, చేరికలూ ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరుగుతోందో.. కేబినెట్ నుంచి ఉద్వాసన ఎవరికో, అవకాశం ఎవరికో?
http://www.teluguone.com/news/content/ayyanna-and-rrr-into-cabinet-39-202898.html





