బీఆర్ఎస్ కు గువ్వల బాలరాజు గుడ్ బై
Publish Date:Aug 5, 2025
Advertisement
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. అచ్చంపేట నుంచి బాలరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా పని చేశాడు. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. గత ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో బాలరాజు భేటీ అవ్వడంతో ఆయన బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఆయనను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్ అధిష్టానం ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ.. బాలరాజు మాత్రం తన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పినట్లు సమాచారం. గువ్వల బాలరాజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే .. కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. ఇప్పుడు బాలరాజు తన నిర్ణయంతో రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. గులాబీ బాస్ కేసీఆర్ తనకు అండగా ఉన్నంతవరకు తనను ఎవరూ టచ్ చేయలేరంటూ ఆయన గతంలో నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా వ్యవహరించేవారు. అటువంటి బాలరాజు గులాబీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో పార్టీకి రాజీనామా చేయడం క్యాడర్ని అయోమయంలో పడేసిందంట. గువ్వల బాలరాజు నిర్ణయంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి . ఆయన గులాబీ నీడను వీడి కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం కొనసాగుతుంది. దానికి అనుగుణంగానే గత కొద్దిరోజులుగా తన సన్నిహితులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుండి మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇచ్చేందుకు గులాబీ పార్టీ నిర్ణయం తీసుకోవడమే బాలరాజు రాజీనామాకు కారణంగా తెలుస్తున్నది. అదలా ఉంటే గువ్వల బాలరాజు తన అనుచరుడితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్‌ని బిజెపిలో విలీనం చేస్తున్నారనీ.. అంతకంటే ముందే బిజెపి పార్టీలో చేరడం ఉత్తమం అని భావించి పార్టీకి రాజీనామా చేశానని బాలరాజు సదరు నాయకుడితో మాట్లాడినట్లు ఉన్న ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. ఫైనల్ గా తాను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నాను అనే విషయాన్ని ఈ నెల 9న ప్రకటిస్తానని బాలరాజు అంటున్న మాటలు ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ లో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలతో గువ్వల బాలరాజు టచ్‌లో ఉన్నారంటున్నారు. బాలరాజుతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందన్న టాక్ గులాబీ శిబిరంలో గుబులు రేపుతోందంటున్నారు.
నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న గువ్వల బాలరాజు పార్టీకి గుడ్ బై చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గువ్వల బాలరాజుకు రాజకీయ భవిష్యత్ ను ఇచ్చింది గులాబీ పార్టీనే. మొదటినుండి దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరైన గువ్వల బాలరాజు.. అచ్చంపేట నియోజకవర్గంలో తన మాటే శాసనం అన్నట్టుగా పెత్తనం చేశారని చెబుతారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో కూడా బాలరాజు సంచలనంగా మారారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో పరాజయం చవిచూశాడు. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో నామమాత్రంగా పాల్గొంటూ వచ్చిన ఆయన అధిష్ఠానంతోనూ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.
గువ్వల బాలరాజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపిన రాజీనామా లేఖలో తానీ నిర్ణయాన్ని అంత తేలికగా తీసుకున్నది కాదనీ, అయితే తనకు అవసరమైన సమయంలో పార్టీ నుంచి మద్దతు రాకపోవడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. తన రాజీనామాతో పాటుగా.. నియోజకవర్గంలో ఉన్న తన అనుచర గణాన్ని సైతం తన వెంట తీసుకువెళ్లేందుకు గువ్వల బాలరాజు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/atchampet-former-mla-guvvala-balaraju-resign-to-brs-39-203550.html





