వైజాగ్‌లో రైలు ఎక్కిన అస్సాం యువతి మృతి.. ఆ తర్వాత ఏమైంది?
Publish Date:Oct 10, 2026
Advertisement
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది. స్నేహితులతో కలిసి విశాఖపట్నానికి వచ్చిన ఆమె.. కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. రైలు బోగీలో తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ స్నేహితురాలికి ఫోన్ చేసిన ఆ యువతి.. ఆ తర్వాత ఏమైందో తెలియని పరిస్థితి. చివరకు రైల్వే ట్రాక్ సమీపంలో విగతజీవిగా కనిపించింది. అసలు ఆమెకు ఏం జరిగింది? రైలు ప్రయాణంలో ఏం ఎదురైంది? ఆమె మరణం వెనుక కారణాలేంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలే మిస్టరీగా మారాయి. నృత్య ప్రదర్శనల కోసం విశాఖకు.! అస్సాంలోని గువాహటి సమీపంలోని బోండా ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల హిమశ్రీ బోరో బీబీఏ చదువుతోంది. గత నెల సెప్టెంబర్ 16న పది మంది స్నేహితులతో కలిసి నృత్య ప్రదర్శనల కోసం విశాఖపట్నానికి వచ్చింది. కార్యక్రమాలు ముగిసిన తర్వాత కొందరు స్నేహితులు స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు. హిమశ్రీతో పాటు మరో నలుగురు మాత్రం విశాఖలోనే ఉండిపోయారు. ఈ క్రమంలో స్వగ్రామానికి వెళ్లేందుకు ఆమె రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకుంది. రైలు మిస్.. మరో రైలులో ప్రయాణం.! ఈ నెల 6న సిల్‌చార్ ఎక్స్‌ప్రెస్‌లో గువాహటికి వెళ్లేందుకు హిమశ్రీ థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకుంది. అయితే అనుకోని కారణాలతో ఆ రైలును అందుకోలేకపోయింది. దీంతో కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వెళ్లే వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకుంది. జనరల్ టికెట్ కోసం తన స్నేహితురాలు జ్యోతి చౌదరిని సంప్రదించింది. ఆమె మరో వ్యక్తి ద్వారా సహకారం అందించింది. అర్ధరాత్రి 1.36 గంటలకు విశాఖపట్నం స్టేషన్‌కు చేరుకున్న వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో బెర్త్ కోసం ప్రయత్నించారు. అయితే అప్పటికే రైలు కదలడంతో హడావుడిగా కిక్కిరిసిపోయిన ఎస్-2 బోగీలోకి హిమశ్రీ ఎక్కింది. ఆమె లగేజీని అందించిన అభినాష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ, ఆ ప్రయాణమే ఆమె జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అర్ధరాత్రి ఫోన్.. స్నేహితురాలికి భయంతో సమాచారం.! రైలు ప్రయాణం సాగుతుండగా అర్ధరాత్రి 2.39 గంటలకు హిమశ్రీ తన స్నేహితురాలు జ్యోతి చౌదరికి ఫోన్ చేసింది. బోగీలో కొందరు మద్యం తాగి తనను ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపింది. అంతేకాదు.. మూడు సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్‌ను కూడా పంపించింది. ఆ తర్వాత ఫోన్ కాల్ కట్ అయింది. హిమశ్రీ నుంచి వచ్చిన సమాచారం స్నేహితురాలిని ఆందోళనకు గురిచేసింది. వెంటనే ఆమె క్లాస్‌మేట్ అనూప్ తివారీకి విషయం తెలియజేసింది. అతడు రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి, యువతిని కొందరు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. స్నేహితులు ఆమెకు ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని ఆందోళన చెందుతుండగానే.. మరో విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. బోగీలో లేని యువతి.. మిగిలింది లగేజీ మాత్రమే.! తెల్లవారుజామున 3.56 గంటలకు రైలు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌కు చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్-2 బోగీలో తనిఖీలు చేపట్టారు. కానీ, హిమశ్రీ అక్కడ కనిపించలేదు. ఆమె బ్యాగులు, సూట్‌కేసు మాత్రమే బోగీలో కనిపించాయి. దీంతో అసలు ఆమె ఎక్కడికి వెళ్లిందన్న ప్రశ్న తలెత్తింది. రైలులోనే ఉన్న యువతి ఒక్కసారిగా కనిపించకుండా పోవడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన హిమశ్రీ మృతదేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఈ నెల 8న కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదమా? ఎవరైనా తోసేశారా.? చదువుకుంటూ.. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న 21 ఏళ్ల యువతి అనుమానాస్పదంగా మరణించడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. తమ బిడ్డకు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆ కుటుంబం ఆవేదనకు సమాధానం దొరకాల్సి ఉంది. రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడిందా? లేక ఎవరైనా కిందకు తోసేశారా? బోగీలో ఆమెను వేధించిన వ్యక్తులు ఎవరు? ఆమె పంపించిన వీడియోలో ఏముంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించగా, కేసు దర్యాప్తు కోసం 21 మంది అధికారులతో కూడిన ఏడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) నుంచి నలుగురు సభ్యులతో మరో బృందం కూడా రంగంలోకి దిగింది. న్యాయం కోసం రెండు రాష్ట్రాల సమన్వయం.! హిమశ్రీ మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరినట్లు వెల్లడించారు. దర్యాప్తులో సమన్వయం కోసం అస్సాం పోలీసు అధికారిని ఏపీకి పంపినట్లు తెలిపారు. [ Assam Youth Himashree Boro, Visakhapatnam Train Incident, Vivek Express Incident, Srikakulam News, Penubarthi Railway Tracks, Andhra Pradesh Police Investigation, Suspicious Death Case, Indian Railways, Railway Crime News, Himashree Boro Last Phone Call, Assam CM Himanta Biswa Sarma, CM Chandrababu Naidu, AP News, Telugu News, TeluguOne ]
ఓ యువతి అనుమానాస్పద మృతి.. ప్రయాణంలో ఆమె చేసిన ఆఖరి ఫోన్ కాల్.. ఆ తర్వాత కనిపించకుండా పోవడం.. చివరకు రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహంగా కనిపించడం.. ఈ ఘటన ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. హిమశ్రీ మరణానికి అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలంటే నిజాలు వెలుగులోకి రావాలి. బాధ్యులు ఎవరైనా ఉంటే చట్టం ముందు నిలబెట్టాలి. అప్పుడే ఆ కుటుంబానికి కొంతైనా న్యాయం జరిగినట్లవుతుంది.
http://www.teluguone.com/news/content/assam-youth-himashree-boro-25-233944.html





