రాజకీయాలకు దూరమైన అశోక్‌గజపతి.. అభిమానుల భావోద్వేగాలు
Publish Date:Jul 16, 2025

Advertisement
ముందు నుంచి తెలుగుదేశం పార్టీతోనే పయనించిన అశోక్‌గజపతిరాజుకు పొలిటికల్ రిటైర్‌మెంట్ తర్వాత సముచిత గౌరవం లభించింది. ఆయన గవర్నర్ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులలో కలిగిన భావోద్వేగాలివి. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏ స్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీతో అశోక్‌గజపతిరాజుది విడదీయరాని బంధం. 1982 మార్చి 28న నందమూరి తారకరామారావు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. అప్పుడు ఎన్టీఆర్ వెంట ఉన్నది అశోక్‌గజపతిరాజు. ఆయన పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. 43 ఏళ్ల సుదీర్ఘ టీడీపీ ప్రస్థానంలో అశోక్ ఎన్నడూ పార్టీ గీత దాటలేదు. ఆయనకు పార్టీ అన్నీ ఇచ్చింది. ఆయన సైతం పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశారు. వాస్తవానికి సామాజికవర్గపరంగా రాజకీయాలు నడుస్తాయి. విజయనగరం జిల్లాలో ఆ పరిస్థితి రాలేదు. రెండు బలమైన సామాజికవర్గాలను సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు.
అశోక్ తండ్రి పీవీజీ రాజు ఎంపీగా ఉండేవారు. సోదరుడు ఆనందగజపతిరాజు విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అశోక్ తొలిసారిగా 1978లో జనతా పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. జాతీయ కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్, స్వతంత్ర, జనతా పార్టీలు పోటీ చేయగా చతుర్ముఖ పోటీలో అశోక్ గజపతిరాజునే విజయం వరించింది. అనంతరం ఎన్టీఆర్ పిలుపు మేరకు అశోక్ టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయనగరం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు ఆనందగజపతిరాజు విశాఖ జిల్లా భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తొలిసారిగా అశోక్ ఎన్టీఆర్ కేబినెట్‌లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 1985 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు.
1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన విజయం సాధించారు కానీ రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది. అయినా ఐదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్రలో తన వాణి వినిపించారు. అశోకగజపతి రాజు 1994లో గెలిచిన అశోక్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా, 1995లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. 2004లో మాత్రం టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన అశోక్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి అదే కోలగట్ల వీరభద్రస్వామిపై గెలుపొందారు అశోక్. 2014 ఎన్నికల్లో అధినేత చంద్రబాబు సూచన మేరకు విజయనగరం ఎంపీగా పోటీచేసి గెలిచారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన పౌరవిమానయానశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 2018లో టీడీపీ.. ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో కేంద్ర మంత్రి పదవికి అశోకగజపతి రాజు రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
జిల్లా అభివృద్ధిలో అశోక్ పాత్ర ఉంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. బొబ్బిలి గ్రోత్ సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు ఆయన చొరవే. 1995లో ఎన్టీఆర్ ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ సమయంలో అశోక్ విన్నపంతో రాష్ట్ర మంత్రివర్గంతో పాటు యంత్రాంగం జిల్లాకు వచ్చింది. బహిరంగ ప్రదేశంలోనే శాఖల వారీగా సమస్యలను, విన్నపాలను ప్రజల నుంచి తీసుకున్నారు. విజయనగరంలో సంతకాల వంతెనగా పిలిచే ఎత్తురాళ్ల బ్రిడ్జి అశోక్ చొరవతోనే నిర్మితమైంది. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం 8వేల మంది సంతకాలతో కేంద్రానికి పంపడంతో ప్రభుత్వం స్పందించింది. విజయనగరంలో ఎత్తైన బ్రిడ్జి నిర్మాణం జరిగింది.
అశోక్ గజపతిరాజు విజయనగరం మండలం ద్వారపూడిని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం రూపురేకలనే మార్చేశారు. మరో వైపు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం లోక్‌సభ పరిధిలో అక్షరాస్యతను పెంపొందించేందుకు చిట్టిగురువులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది విజయ వంతంమైంది. తాను నిర్వర్తించిన పౌర విమానయాన శాఖతో జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. 2014లో పౌర విమానాయాన శాఖ బాధ్యతలు చేపట్టిన అశోక్.. విభజన హామీల్లో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చారు. అప్పటి సీఎం చంద్రబాబును ఒప్పించి భోగాపురానికి విమానాశ్రయాన్ని కేటాయించేలా చేశారు. జాతీయ రహదారులు, వ్యవసాయం, తాగునీటి కోసం వేలాది కోట్లు మంజూరు చేయించిన ఘనత ఆయనదే. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిందన్న నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో గవర్నర్ గిరీ దక్కడంపై ఆనందంతో భావోద్వేగాలకు గురవుతున్నారు.
http://www.teluguone.com/news/content/ashoak-gapapathi-raju-followers-emotional-25-202090.html












