కేజ్రీవాల్ భార్య మరో రబ్రీదేవి కానుందా..?
Publish Date:Jul 15, 2016
Advertisement
ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ స్వచ్ఛంద పదవీ విరమణ వ్యవహారం సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు రేపుతోంది. ఉన్నపళంగా వీఆర్ఎస్ తీసుకోవడం జవాబు లేని ప్రశ్నగా మారడంతో నెటిజన్లు సునీతను ఒక ఆట ఆడుకుంటున్నారు. 22 ఏళ్లపాటు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ఆమె ఈ ఏడాది మొదట్లోనే వీఆర్ఎస్‌కు అప్లై చేసుకోగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నుంచి ఇపుడు అనుమతి రావడంతో ఆమె బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 51 ఏళ్ల సునీత 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి. కేజ్రీవాల్, సునీత భోపాల్‌లో శిక్షణ కార్యక్రమంలో ఉండగా ప్రేమ వివాహం చేసుకున్నారు. కేజ్రీవాల్ కూడా తొలుత ఐఆర్ఎస్ సర్వీస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చేశారు. తాజాగా ఆయన భార్య కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. నెటిజన్లు పలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సునీతను ప్రస్తావిస్తూ సెటైర్లు విసురుతున్నారు. సునీతను బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిలా పోలుస్తున్నారు. కుంభకోణాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి జైలుకెళ్లడం ఖాయం అనుకున్న దశలో తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్. రాజకీయాలు ఏం తెలియని సాధారణ గృహిణి అయిన రబ్రీదేవికి అత్యున్నత అధికారాన్ని కట్టబెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రబ్రీని సీఎం పీఠంపై కూర్చోబెట్టి లాలూ చక్రం తిప్పారు. ఈ ఉదంతాన్ని గుర్తు చేసిన పలువురు నెటిజన్లు సునీతను చదువుకున్న రబ్రీదేవిగా అభివర్ణించారు. ఢిల్లీ సీఎం పదవిని సునీతకు వదిలేయనున్న కేజ్రీ పంజాబ్, గోవా రాష్ట్రాల బరిలోకి నిలవనున్నారని కొందరు వ్యాఖ్యానించారు. ఇక కొందరేమో రాజ్యసభకు పంపేందుకే సునీతతో ఉద్యోగానికి రాజీనామా చేయించారని కామెంట్ చేశారు. ఈ గందరగోళంపై ఆప్ స్పందించింది. సునీత రాజకీయాల్లోకి రారని..వారసత్వ రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఆప్ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని వెల్లడించింది.
http://www.teluguone.com/news/content/arvind-kejriwal-45-63827.html





