నేపాల్ మాజీ ప్రధాని దేవుబాపై అరెస్టు వారెంట్
Publish Date:Apr 9, 2026
Advertisement
నేపాల్ దేశ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబాతో పాటు ఆయన భార్య, విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఆర్జు దేవుబా రాణాలపై ఖాట్మండు జిల్లా కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా దేవుబా దంపతుల ఆస్తులపై మనీ లాండరింగ్ నిరోధక శాఖ విచారణ జరుపుతోంది. ఈ విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారికి వారెంట్లు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నేపాల్ రాజకీయాల్లో అత్యంత ప్రభావమంతమైన నేత అయిన దేవుబాపై అరెస్టు వారంట్ జారీ కావడం ఆ దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఉండగా.. దేవుబాపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తునకు గత ఏడాదే బీజం పడింది. ఖాట్మండు శివార్లలోని బుధనీల్‌కంఠలో ఉన్న వీరి నివాసంలో సగం కాలిన కరెన్సీ నోట్లు లభించడం అప్పట్లో పెను దుమారం రేపింది. ఈ ఆధారాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు.. వారి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. అయితే ప్రస్తుతం దేవుబా దంపతులు నేపాల్‌లో లేరు. చికిత్స నిమిత్తం వారు సింగపూర్‌లో ఉన్నారు. షేర్ బహదూర్ దేవుబా నేపాల్ ప్రధానిగా ఐదుసార్లు పనిచేశారు. ఆయన సతీమణి ఆర్జు దేవుబా కూడా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ శాఖను నిర్వహించారు. అయితే గతేడాది సెప్టెంబరులో దేశంలో జరిగిన భారీ ప్రజా నిరసనల కారణంగా అప్పటి ప్రభుత్వం పడిపోయింది. ఆ సమయంలో నిరసనకారులు దేవుబా నివాసంపై దాడి చేసి నిప్పు పెట్టారు కూడా. తాజా కోర్టు వారెంట్ల నేపథ్యంలో ఒకవేళ వారు విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. విదేశాల్లో ఉన్న వారిని రప్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే దిశగా దర్యాప్తు సంస్థలు అడుగులు వేస్తున్నాయని అంటున్నారు. దేవుబా మద్దతుదారులు దీనిని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/arrest-warrant-issued-against-former-nepal-prime-minister-deuba-36-216998.html





