అరెస్టు భయంతో అజ్ణాతంలో వల్లభనేని వంశీ?
Publish Date:Jul 18, 2024
Advertisement
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయారా? నియోజకవర్గంలోని ఆయన ముఖ్య అనుచరులపై కేసులు, అరెస్టులే ఇందుకు తార్కానమా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వంశీ ఇప్పుడు దాదాపు అజ్ణాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు అన్నది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే గతంలో ఆయన చేసిన అక్రమాలు, వ్యవహరించిన తీరు పట్ల నియోజకవర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రజాగ్రహాన్ని ముందే గమనించిన వంశీ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించేసినట్లుగా మాట్లాడి సానుభూతి దండుకుందామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఫలించే అవకాశం లేదని అర్ధమైన పిమ్మట, వైసీపీలో తనను వ్యతిరేకించే వర్గం వారిని మంచి చేసుకోవడానికి ఇవే తన చివరి ఎన్నికలంటూ ఓ విధంగా బతిమలాడారు. మద్దతు ఇవ్వమని ప్రాధేయపడ్డారు. అవన్నీ విఫలమయ్యాయి. గన్నవరం ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారు. అయితే ఓటమితో వంశీ తప్పులు ప్రక్షాళన కాలేదు. ఓటమి తరువాత వంశీ తప్పులన్నీ ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం తరఫున రెండు సార్లు గవన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ మూడోసారి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో సారి అంటే 2019 ఎన్నికలలో విజయం తరువాత వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. అలా చేరిన క్షణం నుంచీ ఆయన తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లక్ష్యంగా విమర్శలు, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దాడులూ, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై వంశీ ప్రత్యక్ష పర్య వేక్షణలో జరిగిన దాడి కేసులో ఇప్పుడు వంశీపై కేసు నమోదైంది. అలాగే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో కూడా వంశీ అరాచకాలు, దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తవ్వకాలలో అక్రమాల నుంచి ఎస్సీ భూముల ఆక్రమణ, నకిలీ పత్రాలతో ఇతరుల భూముల రిజిస్ట్రేషన్ లు ఇలా వంశీ పాల్పడిన అక్రమాలపై ప్రజాదర్బార్ లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటన్నిటినీ పరిశీలించి కేసుల నమోదుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన అరెస్టు తథ్యమన్న భయంతోనే వంశీ నియోజకవర్గానికి దూరంగా అజ్ణాతంలో గడుపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/arrest-fear-vallabhaneni-vomshi-under-ground-25-180966.html





