కేసీఆర్ సారూ.. తెలంగాణలో బాధితులు లేరా?
Publish Date:Sep 1, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో బాధితులే లేరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అంతా భేషుగ్గా ఉంది. ప్రజలకు సమస్యలే లేవు.. కానీ పాపం ఇతర రాష్ట్రాలలో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రాంగా, సమస్యలే లేని రాష్ట్రంగా వారిని ఆదుకోవలసిన బాధ్యత తెలంగాణదే, అంటే తనదే అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన బీహార్ వెళ్లారు. అక్కడ గాల్వాన్ అమరుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే సికిందరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ వలస కూలీల కుటుంబాలనూ పరామర్శించి వారికీ నష్టపరిహారం ఇచ్చారు. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు కన్నుమూస్తే వారి కుటుంబాలను పరామర్శించడానికి మాత్రం కేసీఆర్ కు మనసు రాలేదో లేక తీరిక దొరకలేదో అర్ధంకాదు కానీ ఆయన మాత్రం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలోనూ ఇలాగే జరిగింది. ఆయన పంజాబ్ వెళ్లారు. అక్కడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అంద జేశారు. ఆ సొమ్ములేవీ కేసీఆర్ జేబులోంచో, కుటుంబ ఆస్తులు అమ్మో ఇచ్చిన సొమ్ములు కాదు. తెలంగాణ ప్రజల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేసిన పన్నుల నుంచి ఇచ్చినవి. ఆ సొమ్ములపై తొలుత అధికారం తెలంగాణలోని బాధిత ప్రజలదే. రాష్ట్రంలో ప్రజలను వారి కష్టాలకు, వారి నష్టాలకూ వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లి సొమ్ములు పంపిణీ చేసి తన ప్రతిష్టను పెంచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారన్న విమక్షాల విమర్శలను జనం కూడా సమర్థిస్తున్నది అందుకే. రాష్ట్రాన్ని గాలికొదిలేసి జాతీయంగా ఓ పెద్ద నాయకుడిగా ఎదగాలన్న కేసీఆర్ ప్రయత్నాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు. ముందు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని వారు కోరుతున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని సాక్షాత్తూ రాష్ట్ర పోలీసుల నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అటువంటిది రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాల్సింది పోయి.. ఇతర రాష్ట్రాలలో ప్రజలను ఉద్ధరించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట సామెతగా అభివర్ణిస్తూ పరిశీలకులు సైతం తప్పుపడుతున్నారు. గతంలో కొండగట్టు వద్ద బస్సు బోల్తా పడి పలువురు మరణించిన సందర్భంలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సాయంఅందించలేదు. కేసీఆర్ బాధి కుటుంబాలను పరామర్శించలేదు. ఇప్పుడు కేసీఆర్ బీహార్ పర్యటన సమయంలో ప్రజలు నాటి సంఘటనను గుర్తు చేసుకుని తెలంగాణ ప్రజలు ప్రజలు కారా? వారి బాధలు బాధలు కావా.. లేక రాష్ట్రంలో బాధితులకు చేసిన సాయం గురించి దేశంలో పెద్దగా మాట్లాడుకోరన్న భావమా అంటూ కేసీఆర్ వైఖరిని తప్పుపడుతున్నారు. జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు కోసం ప్రజాధనాన్ని వాదించుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా అన్ని పత్రికలలో భాషతో, వాటి సర్క్యలేషన్ తో సంబంధం లేకుండా పేజీలకు పేజీలు ప్రకటనలు ఇవ్వడాన్ని వారీ సందర్భంగా ప్రస్తావించి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/are-there-no-problems-in-the-state-telangana-people-questions-kcr-25-143015.html





