జగన్ కు స్వాగతం పలికిన ఖాళీ ఖజానా.. తక్షణం 5 వేల కోట్లు కావాలి
Publish Date:May 30, 2019
Advertisement
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ కి పెద్ద సవాళ్లు ఎదురవనున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా కనిపిస్తోంది. దీంతో ఈ నెల జీతాలు, పింఛన్ల కోసం ఓవర్ డ్రాఫ్టునకు వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో రూ100 కోట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించాల్సి ఉంది. వీటికోసం ప్రభుత్వానికి రూ.5,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. సామాజిక పింఛన్ల రూపంలోనే రూ.1200 కోట్ల వరకు నిధులు అవసరమని ఆర్థికశాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఓవర్ డ్రాఫ్టు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అయితే ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలే అని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఓవర్ డ్రాఫ్టుతోనే ప్రారంభమయింది. ‘పసుపు-కుంకుమ’, ‘అన్నదాతా సుఖీభవ’ చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం, కొన్ని బ్యాంకుల నుంచి రుణసమీకరణకు నాటి ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్ రుణ మొత్తాలనూ ఈ పథకాల కోసం మళ్లించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడుదొడుకుల్లో ఉండటంతో ఓవర్ డ్రాఫ్టు, చేబదుళ్లు తప్పడం లేదు. నిజానికి బడ్జెట్‌కు అనుగుణంగానే ఖర్చులు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కిందటి ఆర్థిక సంవత్సరం చివర్లో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థికశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.8,000 కోట్ల వరకు రుణాల తీసుకునేందుకు రాష్ట్రానికి రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్‌లోనే రూ.5,000 కోట్ల వరకు రుణం తీసుకుని నాటి అవసరాలకు సర్దుబాటు చేసేశారు. ఆ తర్వాత ఈ నెలారంభంలో మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ సందర్భంగానే ఈ నెలలో మరోసారి రుణం తీసుకోబోమని రిజర్వు బ్యాంకుకు హామీలేఖ రాసారు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ రుణానికి ఇప్పుడు ఆస్కారం లేకుండా పోయింది. మరి సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ ఏం చేస్తారో చూద్దాం.
http://www.teluguone.com/news/content/ap-treasury-balance-is-only-rs-100-crore-new-govt-should-go-to-the-overdraft-39-87160.html





