కేంద్రానికి సంగీతంగా జగన్ సర్కార్ రుణగొణ ధ్వని
Publish Date:Jul 26, 2022
Advertisement
ఏపీ సర్కార్ అప్పుల విషయంలో కేంద్రం కొట్టినట్టు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఏడ్చినట్లు చేయడం లేదు. కేంద్రం చేసిన హెచ్చరికలను, వెల్లడించిన జాబితాను తనకు అనుకూలంగా ఉన్నాయని సంబరపడిపోతోంది. ఏపీ ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఉన్నాయని మురిసిపోతోంది. అయితే కేంద్రం పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన గణాంకాలు పాక్షికం మాత్రమే. పూర్తి వివరాలు సేకరించకుండా జగన్ సర్కార్ చెప్పిన లెక్కలు, అబద్ధాలనే ఆధారం చేసుకుని ఏపీ అప్పులను ప్రకటించింది. అలా అరకొర వాస్తవాలతో కేంద్రం వెల్లడించిన వివరాలే ఇక ఏపీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పులు గగనమే అవుతాయని తేల్చేసింది. కానీ నొసటితో మాత్రం మీకేం భయంలేదు.. మా అభయం ఉందని భరోసా ఇచ్చేస్తోంది. అందుకే పార్లమెంటులో రాష్ట్రాల అప్పుల జాబితా ప్రకటించిన రోజే రాష్ట్రం కొత్తగా రెండు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. జగన్ సర్కార్ రుణగొణ ధ్వని కేంద్ర ప్రభుత్వానికి సంగీతంలా వినిపిస్తున్నదని భావించాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటులో రాష్ట్రం అప్పుల చిట్టాను ప్రకటిస్తూ కేంద్రం ఆర్బీఐ ఇచ్చిన వివరాల మేరకు అని తెలిపింది కానీ వాస్తవంగా పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు. ఆర్బీఐ విడుదల చేసిన డేటానే యథాతథంగా పార్లమెంటులో ప్రకటించేశారు. ఇక తాజాగా జగన్ సర్కార్ మంగళవారం (జులై 26) మరో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. ఇది కూడా ఎలాగంటే వేయి కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఏడు సంవత్సరాలకు 7.79 శాతం వడ్డీతోనూ. మరో వేయి కోట్ల రూపాయలు 8.04 శాతం వడ్డీతోనూ తీసుకుంది. కేంద్రం పదే పదే రాష్ట్రాన్ని పరిమితికి మించి అప్పులు చేస్తోందంటూ హెచ్చరిస్తూనే అడగడమే ఆలస్యం అన్నట్లు రుణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలోని ఆంతర్యమేమిటని పరిశీలకులు, ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ap-takes-another-2000-crores-loan--through-auction-of-security-bonds-39-140605.html





