ఏపీ ఎన్జీవోలు రాజకీయ మద్దతు తీసుకోక తప్పు చేసారా
Publish Date:Sep 2, 2013
Advertisement
సమైక్యాంధ్ర కోరుతూ ఏపీ ఎన్జీవోలు మొదలుపెట్టిన నిరవధిక సమ్మె మూడు వారాలుపైగా గడిచినప్పటికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ కాంగ్రెస్ అధిష్టానంలో గానీ ఎటువంటి చలనము లేదు. కాంగ్రెస్ అధిష్టానం వారిని సమ్మె విరమించి, అంటోనీ కమిటీకో లేక కొత్తగా ఏర్పరచబోయే మరో ప్రభుత్వ కమిటీకో తమ సమస్యలను నివేదించుకోమని ఉచిత సలహా ఇచ్చింది తప్ప వారి సమ్మెను, అభ్యర్ధనలను పట్టించుకోలేదు. పైగా, ప్రధాన మంత్రితో సహా అందరూ కూడా తెలంగాణా ఏర్పాటుపై ఇక వెనకడుగు వేయబోమని కుండలు బ్రద్దలు కొడుతున్నారు. దీనితో హతాశులయిన ఏపీ ఎన్జీవో నేతలు ప్రతిపక్ష నేతలను, ఇతర రాజకీయ నేతలను కూడా మద్దతు కోసం కలిసినా ప్రయోజనం లేకపోయింది. వారు సీమంధ్రకు చెందిన చిరంజీవి, పళ్ళంరాజు, శీలం, కావూరి, పనబాక, పురందేశ్వరి తదితర కేంద్రమంత్రులను రాజీనామాలు చేసి ఉద్యమాలలోకి రాకపోతే వచ్చే ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెపుతామని హెచ్చరించినప్పటికీ, వారు త్వరలో తమ నిర్ణయం చెపుతామని నచ్చజెప్పి సాగనంపారు. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి, సీమంధ్ర మంత్రులు కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నారనే విషయం ఏపీ ఎన్జీవోలకు తెలిసి ఉన్నపటికీ, వారు చేతలుడిగి కూర్చోవడంతో వారిని దూరం పెట్టారు. ఇక తమ మద్దతుకోసం వస్తున్నశాసనసభ్యులను రాజకీయ నాయకులను కూడా నిలదీస్తూ ఏపీ ఎన్జీవోలు వారిని దూరంగా తరిమేశారు. ఇక ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, వైకాపాల మద్దతు తీసుకోకుండా ఏపీ ఎన్జీవోలు తమ సమ్మెతో సమైక్యాంధ్ర సాధించాలని భావించారు. ఈవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలనదరినీ దూరంపెట్టడం వలన వారి సమ్మెకు అవసరమయిన రాజకీయ మద్దతు కరువవడంతో, వారి మాట వినేవారే లేకుండాపోయారు. ముల్లును ముల్లుతోనే తీయలన్నట్లు, రాజకీయనాయకులను రాజకీయ నాయకుల సహాయంతోనే డ్డీ కొనాలనే జ్ఞానోదయం ఏపీ ఎన్జీవోలకు చాలా ఆలస్యంగా జరిగింది. బహుశః అందువల్లేనేమో ఈ నెల 7న హైదరాబాదులో తాము తలపెట్టిన భారీ బహిరంగ సభకు సమైక్యాంధ్ర కోరుతున్న నేతలందరూ పార్టీలకతీతంగా వస్తే ఆహ్వానిస్తామని వారు ప్రకటించారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తునందున తెదేపా ఈ సభలో పాల్గోనలేకపోవచ్చును. కానీ, సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న సీమంధ్ర కాంగ్రెస్, వైకాపాలు ఈసువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. కానీ అసలు సభకు పోలీసుల నుండి అనుమతి లభిస్తుందా? లభించినా తెలంగాణా నేతలు తలపెడుతున్న పోటీ సభలతో సభ జరుగుతుందా? అనే అనుమానాలున్నాయి. ఏమయినప్పటికీ, రాజకీయ మద్దతు లేకుండా ఏపీ ఎన్జీవోలు చేసిన నెలరోజుల సమ్మె వ్యర్ధం అయిపోయే అవకాశాలే ఎక్కువ. ఈ నెల జీతాలు అందక ఉద్యోగులు నిరాశ చెందుతూ, సమ్మె ఎంత త్వరగా ముగిస్తే అంత మేలనే ఆలోచన మొదలవుతున్న ఈ తరుణంలో, ఏపీ ఎన్జీవోనేతలు ఇంత ఆలస్యంగా రాజకీయ నాయకులను, పార్టీలను సమ్మెకు మద్దతు కోరడం వలన ప్రయోజనం ఉండకపోవచ్చును. ఒకసారి ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించుకోవడం మొదలుపెడితే రాజకీయ పార్టీలు కూడా ఉద్యమాలు నిలిపివేసి ఎన్నికల సన్నాహాలలో పడిపోతాయి. బహుశః అంతిమంగా ఇదే జరుగుతుందేమో?
http://www.teluguone.com/news/content/ap-ngos-39-25515.html





