కాంగ్రెస్ ఉదాసీనత, ఉద్యోగులకు అగ్నిపరీక్ష
Publish Date:Sep 28, 2013
Advertisement
సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీవోలు మొదలుపెట్టిన నిరవధిక సమ్మె దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఏమాత్రం జోరు తగ్గకపోగా ఇప్పుడు కొత్తగా కేంద్రప్రభుత్వ ఉద్యోగులు కూడా వారికి తోడవుతున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమంధ్ర కాంగ్రెస్ నేతలు ఎంతగా అడుగుతున్నపటికీ, కేంద్రం మాత్రం ఇంత వరకు వారితో చర్చించేందుకు కూడా ముందుకు రాలేదు. ఏమయినా సమస్యలుంటే అంటోనీ కమిటీకి వెళ్లి చెప్పుకోండని వారికి ఒక ఉచిత సలహా పడేసి చేతులు దులుపుకొంది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్నీప్రస్తావిస్తూ కేంద్ర వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏ విధమయినా నిర్ణయమయినా తీసుకోవచ్చును. కానీ ముందు రాష్ట్రానికి రధచక్రాలు వంటి ఉద్యోగులతో సంప్రదింపులు మొదలుపెట్టడానికి వెనకాడుతుండటంతో వారు చాలా ఆగ్రహంతో ఉన్నారు. వారితో సంప్రదింపులు మొదలుపెడితే అది తన ఓటమిని అంగీకరించినట్లేనని కాంగ్రెస్ అధిష్టానం భేషజానికి పోవడంచేతనో లేక అది తెలంగాణా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందని భయం చేతనో మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం సమ్మె చేస్తున్నఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్య, నిర్లిప్త వైఖరిని ప్రదర్శిస్తోంది. దీనివలన ఉద్యోగులలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక విముఖత భావం ఏర్పడటంతో, ఇదే అదునుగా వైకాపా వారిని మంచి చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే నేటికీ ఉద్యోగులు అన్ని రాజకీయపార్టీలను సమాన దూరంలో ఉంచాలని భావిస్తున్నారు. అయితే అనేక వ్యయప్రయాసలకు ఓర్చి సుదీర్ఘపోరాటం చేస్తున్నఉద్యోగులకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేని కారణంగానే, కేంద్రప్రభుత్వానికి ఇంత అలుసుగా కనిపిస్తున్నారన్నది వాస్తవం. రాష్ట్ర విభజన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కానీ, ఆ పార్టీతో చేతులు కలిపే ఆలోచనతో ఉన్న వైకాపాతో గానీ, సమైక్యాంధ్రకు నిర్ద్వందంగా మాట ఇవ్వలేకపోతున్న తెదేపాతో గానీ వారు చేతులు కలుపలేకపోవడంతో వారు కాంగ్రెస్ అధిష్టానానికే కాక తెరాసకు కూడా లోకువయిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పోరాటం కొనసాగించాలంటే తప్పని సరిగా సరయిన పార్టీ మద్దతు తీసుకోవడం చాలా అవసరం. ఇంతవరకు చాల ఐకమత్యంగా పోరాటం చేసినప్పటికీ, వారి పోరాటం తుది దశకు చేరుకొన్న ఈ తరుణంలో మరింత అప్రమత్తతో, మరింత ఐకమత్యంతో సరయిన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగవలసి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/ap-ngos-37-26224.html





