స్థానిక ఎన్నికల రీషెడ్యూల్ : వైసీపీ ట్రాప్ లో పడిన తెలుగుదేశం.. మసకబారిన ప్రతిష్ఠ.!
Publish Date:Oct 23, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజకీయం విలక్షణం. ఆ పార్టీ విధానాలూ, ఎత్తుగడలూ, వ్యూహాలూ అన్నీ సొంత లాభం, ప్రయోజనం కంటే.. ప్రత్యర్థి పార్టీలను బదనాం చేయడం కోసమే అన్నట్లు ఉంటాయి. ఈ విషయంలో స్థానిక ఎన్నికల విషయంలో మరో సారి రుజువైంది. స్థానిక ఎన్నికలు సజావుగా సాగవు, హింస ప్రజ్వరిల్లుతుంది అంటూ ముందునుంచే ఓ ఎన్విరాన్ మెంట్ క్రియోట్ చేసిన వైసీపీ.. తెలుగుదేశం కూటమిని ట్రాప్ లో పడేసింది. వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు. అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది. ఇక స్థానిక నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాకాండను జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది. ప్రసారం చేసింది. ఇక ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు కూటమి సర్కార్ కు వ్యతిరేకం కాదని ఎంతగా నెత్తీనోరూ బాదుకుని చెప్పినా ఫలితం లేదు. ఎన్నికలు రీషెడ్యూల్ అయ్యాయి. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ఎన్నికలను నవంబర్ 1న జరుగుతాయి. ఇక రీపోలింగ్ కు ఒక రోజు రిజర్వ్ చేసి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి నవంబర్ 3గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తిరుపతి, కడప కార్పోరేషన్లోని పలు డివిజన్లు, అలాగే రాజంపేట, మైదుకూరు మున్సిపాలిటీలలో పలు వార్డులలో మళ్ళీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. 25న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటుంది. అదలా ఉంచితే చాలా ముందునుంచే జగన్ హెచ్చరిస్తున్నా, అల్లర్ల నివారణకు, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ విధ్వంసం, అల్లర్ల వల్ల వైసీపీకి వచ్చేదీ, పోయేదీ ఏమీ లేదు. కట్టుదిట్టమైన భద్రత లేకపోయినా... ఆ పార్టీ నామినేషన్లు వేసేదీ లేదు.. వెసినా గెలిచినా పరిస్థితీ లేదు. పుంగనూరు, పులివెందులలో పరిస్థితిని గమనించిన ఎవరికైనా స్థానిక ఎన్నికలలో వైసీపీ సత్తా చాటే పరిస్థితి ఇసుమంతైనా లేదని అవగతమౌతుంది. సో.. ఈ రీషెడ్యూల్ వల్ల వైసీపీ బలం పెరగదు, ప్రతిష్ఠ ఇనుమడించదు. కానీ తెలుగుదేశం పార్టీకీ, కూటమి ప్రభుత్వానికి మాత్రం ఈ పరిణామం ఒకింత ఇబ్బందికరమే. స్థానిక సీట్ల సర్దుపాట్ల నుంచి, ఎన్నికల వాయిదా వరకూ అన్ని విషయాలకూ కూటమి సర్కార్ బాధ్యత వహించకతప్పని పరిస్థితి. మొత్తంగా నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితుల్లోనూ వైసీపీ తెలుగుదేశం కూటమి ప్రతిష్ఠను మసకబార్చే విషయంలో ఓ మేరకు విజయం సాధించింది.
[AP Municipal Elections Rescheduled, SEC Andhra Pradesh, Changes tMunicipal E lection Dates, AP Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/ap-municipal-elections-rescheduled-25-235164.html





