జగన్ ఏమైనా గజినీయా: మెమరీ లాస్ అయ్యిందా? ఎన్నికల హింసపై సుద్దులెందుకు.?
Publish Date:Oct 20, 2026
Advertisement
రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం పోయాక మరో మాట వినిపించడం కొత్తేమీ కాదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడే నాయకులు వైఖరిని మరచిపోయి మాట్లాడటం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల చుట్టూ సాగుతున్న వివాదం.. ఈ వివాదం విషయంలో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై రాజకీయవర్గాలలోనూ, నెట్టింటా కడా ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. స్థానిక నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారనీ, అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చేసిన ఆరోపణలు నిజమా కాదా అన్న విషయం.. అన్నది ఆధారాలు, అధికారిక విచారణ తేలుస్తుంది. అ విషయం పక్కన పెడితే.. జగన్ గతంలో అంటే ఆయన అధికారంలో ఉండగా ఎన్నికల వ్యవస్థలతో వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అరాచకాలు జరిగాయని జగన్ చెప్పడాన్నితప్పుపట్టడం లేదు కానీ, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎదురైన విమర్శలకు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆయన చేస్తున్న ఫిర్యాదులకు ఒకే కొలమానం వర్తిస్తుందా? ప్రజాస్వామ్యంపై ఆవేదన వ్యక్తం చేసే నాయకుడి మాటలకు విశ్వసనీయత రావాలంటే, గతంలోనూ అదే సూత్రాలకు కట్టుబడి ఉండాలి, లేదా ఉన్నట్లు కనిపించాలి.. కానీ సీఎంగా ఉన్న సమయంలో జగన్ వ్యవహరించిన తీరుపై, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు చేస్తున్న విమర్శలు ఫిర్యాదులప పోలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. తనదాకా వస్తే కానీ.. అన్న సమేతను గుర్తు చేస్తున్నదని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి పోటీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి. అలాగే పార్టీ శ్రేణుల్లో కనిపించని ఉత్సాహం. పార్టీ నాయకుల ఉదాశీనత. మేయర్లు, మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలులో ఉండటం కూడా వైసీపీలో పోటీకి ముందే పరాజయాన్ని అంగీకరించేసి చేతులెత్తేయడానికి ఒక కారణంగా పరీశీలకులు విశ్లేషిస్తున్నారు. 2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి, తిరుపతి తదిత ప్రాంతాల్లో తమ అభ్యర్థులను అడ్డుకున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. నామినేషన్ పత్రాలు లాక్కున్నారని, దాడులు జరిగాయని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మరోవైపు, కూటమి నాయకులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల అడ్డంకులను ప్రస్తావిస్తూ ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం స్వతంత్రత, ఎన్నికల కమిషనర్ల నియామక విధానం, నిష్పక్షపాత ఎన్నికల అవసరం గురించి మాట్లాడుతున్న జగన్.. గతంలో అంటే తాను అధకారంలో ఉన్న సమయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పట్ల వ్యవహరించిన తీరుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో ఎన్నికల నిర్వహణ, స్థానిక ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారాలపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారం న్యాయస్థానాల దాకా వెళ్లింది. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థల గౌరవం గురించి జగన్ మాట్లాడుతున్నప్పుడు, గతంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉన్నవారు చెప్పిందే నిజమని అంగీకరించడం కాదు. ప్రతిపక్షం చెప్పిందే వాస్తవమని నమ్మడమూ కాదు. ఆధారాలు పరిశీలించి, న్యాయబద్ధమైన నిర్ణయాలకు కట్టుబడటం. జగన్ వ్యవస్థల గౌరవం గురించి మాట్లాడితే, గతంలో వాటితో జరిగిన వివాదాలపై ప్రశ్నలు రావడం సహజం. చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న తన పార్టీ శ్రేణుల ప్రవర్తనపైనా ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందే. [AP Local Body Elections Violence, Jagan Mohan Reddy, Chandrababu Naidu, YCP, TDP, Election Related Violence, Andhra Pradesh Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/ap-local-body-elections-violence-39-234908.html




