ఫోన్ ట్యాపింగ్ నిందితుడి ఫ్లాట్లో.... ఏపీ లిక్కర్ స్కాం బాబులు
Publish Date:Jul 18, 2025

Advertisement
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ , ఏపీ లిక్కర్ స్కాం మధ్య లింకులు ఉన్నట్లు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. మాజీ ముఖ్యంత్రులు కేసీఆర్, జగన్‌ల జాయింట్ ఆపరేషన్‌తోనే ఈ కుట్రలు జరిగాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. దుబాయ్‌లోని పారామౌంట్ హోటల్ ఫ్లాట్ నెంబర్ 5801లో ఏపీ లిక్కర్ స్కాం నిందితులు చాణక్య, వరుణ్ సహా ఇంకొందరు విలాసవంతమైన జీవితం గడిపినట్లు సిట్ గుర్తించింది. ఆ ఫ్లాట్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్‌రావు ఆధీనంలో ఉన్నట్లు వెల్లడైంది. ఆ క్రమంలో రెండు స్కాంలు వైసీపీ, బీఆర్ఎస్‌ల జాయింట్ ఆపరేషనే అన్నది నిరూపితమైందంటున్నారు.
దుబాయ్‌లోని ఖరీదైన ప్రాంతంలో శ్రవణ్‌రావు మరొకరితో కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్‌లోనే లిక్కర్ స్కామ్ నిందితులు మకాం వేసినట్టు తేలడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డికి సన్నిహితంగా ఉంటూ వ్యవహారం నడిపిన చాణక్య బూనేటి, వరుణ్ మరో నలుగురు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు ఆ ఫ్లాట్‌లోనే ఉన్నారని వెల్లడైంది. ఆ ఫ్లాట్‌ను డీలక్స్ హాలిడే హోమ్స్ సంస్థకు లీజుకిచ్చామని, ఆ సంస్థ ఎవరికి అద్దెకిచ్చిందో తమకు తెలియదని శ్రవణ్‌రావు తరపున ఐన్యూస్ యాజమాన్యంఇచ్చిన ప్రకటన అవాస్తవమని తేలింది.
యజమాని కోటా కింద శ్రవణ్‌రావే కొంతకాలం తీసుకుని, లిక్కర్ స్కామ్ నిందితులకు ఇచ్చారని.. స్వయంగా ఆయన వారితో కలిసి ఉన్నారని పక్కా ఆధారాలు సిట్ అధికారులకు లభించాయంట. దుబాయ్‌లోని పారామౌంట్ టవర్ హోటల్స్ అండ్ రెసిడెన్సెస్‌లో 35వ అంతస్తు వరకు హోటల్ ఉండగా ఆపై అంతస్తుల్లో నివాస ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 5801 నంబర్ ఫ్లాట్ శ్రవణ్‌రావుకు సంబంధించింది. దీనిని రెంటల్ ఏజెన్సీకి లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలో ఒక నెల పాటు యజమాని ఆ ఫ్లాట్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. అంతకు మించితే నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు రెండు నెలల పాటు ఫ్లాట్‌ను ఉపయోగించుకున్న శ్రవణ్‌రావు ఒక నెల ఉచితంగా, మరో నెల కేవలం నిర్వహణ ఖర్చులు చెల్లించినట్టు తేలింది. టవర్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. యజమానులు సహా ఎవరు ఫ్లాట్‌లోకి వెళ్లాలన్నా ఆధారపూర్వక వివరాలు ఇవ్వాలి. ఆ వివరాల మేరకు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు శ్రవణ్‌రావు, చాణక్య, మరో నలుగురు ఫ్లాట్‌లోనే ఉన్నారని తేలినట్టు సమాచారం.
ఏపీ లిక్కర్ స్కామ్‌తో దుబాయ్ ఫ్లాట్‌కు లింకులు బయటపడటంతో జగన్, కేసీఆర్‌ల రాజకీయ వ్యాపారం బహిర్గతమైందంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏపీసీసీ ప్రెసిడెంట్, జగన్ చెల్లెలు షర్మిల ఫోన్ ట్యాప్ చేసి ఆ వివరాలు జగన్‌కు అందజేసినట్లు ఆరోపణలున్నాయి. ఒకవైపు చూస్తే తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూ సమన్వయంతో ముందుకెళ్తున్నారు. వారిద్దరు ఎప్పుడు భేటీ అయినా బీఆర్ఎస్, వైసీపీ వర్గాలు నానా రచ్చ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో తమ హయాంలో వైసీపీ, బీఆర్ఎస్ పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, చీకటి వ్యవహారాల్లో లాలూచీ పడ్డారని తాజా ఉదంతాలు స్పష్టం చేస్తుండటంతో ఆపార్టీల ప్రతిష్ట మరింత దిగజారుతూ.. తెలుగు ప్రజల ఆగ్రహానికి గురవుతోంది.
http://www.teluguone.com/news/content/ap-liquor-scam-39-202232.html












