రఘురామ బెయిల్ పిటిషన్ డిస్మిస్.. కింద కోర్టుకు వెళ్లాలన్న హైకోర్టు
Publish Date:May 15, 2021
Advertisement
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం సీఐడీ కోర్టులో ప్రయత్నించమని ఆదేశించింది. నేరుగా హైకోర్టును కాకుండా కింద కోర్టును సంప్రదించాలని హైకోర్టు సూచించింది. అనంతరం రఘురామ బెయిల్ దరఖాస్తుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కింద కోర్టును హైకోర్టు ఆదేశించింది. తీర్పుకాపీని కూడా వెంటనే ఇస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు.. వెంటనే రిమాండ్కు పంపుతామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. రఘురామకృష్ణరాజు ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును శుక్రవారం హైదరాబాదులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో రఘురాజు బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురాజు తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు కోర్టులో వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే లోక్ సభ సభ్యుడు రఘురాజును అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. రఘురాజు అరెస్టుకు సంబంధించి సహేతుక కారణాలు కూడా లేవని వాదించారు. ఎటువంటి కారణాలు చూపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత బెయిల్ అంశంపై జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. దీంతో, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది. సీఐడీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని సూచించింది. బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. జగన్ సర్కార్పైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమైంది. శనివారం నాడు రఘురామకృష్ణరాజుతో పాటు మరో రెండు టీవీ ఛానెల్స్ లో మంగళగిరి సీఐడీ పీఎస్లో 124ఏ,153ఏ, రెడ్విత్ 120బి, 505 సెక్షన్ల కింద కేసులు నమోదవ్వడం సంచలనం రేపుతోంది. ఈ రెండు ఛాన్సల్లో రఘురామకు స్లాట్స్ కేటాయించారని ఎఫ్ఐఆర్లో సీఐడీ పేర్కొంది.
http://www.teluguone.com/news/content/ap-high-court-dismiss-mp-raghurama-raju-bail-petition-39-115500.html





