సంక్షేమ కార్యక్రమాలకు శాశ్విత నిధులు, వ్యవస్థ ఏర్పాటు అవసరమా?
Publish Date:Oct 5, 2014
Advertisement
ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకొంటూ తెదేపా ప్రభుత్వం ఈ నెల రెండవ తేదీ నుండి వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగుల పెన్షన్లు రూ. 1000-1500 వరకు పెంచింది. రాష్ట్ర విభజన, ఆర్ధిక లోటు, పంట రుణాల మాఫీ, విద్యార్ధుల ఫీజు రీ-ఇంబర్స్ మెంటు వంటి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అదనపు భారమేనని చెప్పక తప్పదు. కానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను చెల్లించడానికే సిద్దమయింది. అయితే ప్రభుత్వం ఈ కొత్త పెన్షను పధకం అమలుచేయడం మొదలుపెట్టిన వెంటనే కొత్తగా 5,23,000 మంది పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకొన్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు తెలిపారు. ఒక్క కృష్ణా జిల్లా నుండే 43,900 మంది దరఖాస్తు చేసుకొన్నారని ఆయన తెలిపారు. వారిలో అర్హులయిన వారిని గుర్తించి ప్రభుత్వ వెబ్ సైటులో పెడతామని తెలిపారు. అందువలన ఇదొక నిరంతర ప్రక్రియ అని స్పష్టమవుతోంది. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా పెన్షన్లు ఇచ్చినప్పటికీ అవి నామమాత్రంగా కేవలం రూ.200-500 మాత్రమే ఉండేవి. కనుక ప్రభుత్వానికి అదొక ఆర్ధిక భారంగా ఎన్నడూ కనబడలేదు. కానీ ఇప్పుడు రూ.1000-1500 వరకు పెన్షన్లు ఇస్తుండటంతో కొత్తగా దరఖాస్తు చేసుకొంటున్న వారితో కలిపి చూసుకొన్నట్లయితే, ఆ భారం మరింత పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కానీ నిసహ్హాయులయిన వృద్ధులను, వితంతువులను మరియు వికలాంగులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక ఈ పెన్షన్లను తప్పనిసరిగా కొనసాగించవలసి ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ఆ భారం తిరిగి ప్రజలపై వేసినా లేకపోతే ఏదో వంకపెట్టి అర్హులకు పెన్షను ఇవ్వకుండా తప్పించుకొనే ప్రయత్నం చేసినా ప్రజలు ప్రభుత్వాన్నే తప్పుపడతారు. కానీ బోగస్ లబ్దిదారులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయడం ద్వారా కొంత ఆర్ధిక భారం తగ్గించుకోవడమూ చాలా అవసరమే. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంత గొప్పగా లేకపోయినప్పటికీ, త్వరలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, సాఫ్ట్ వేర్ హార్డ్ వేర్ సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు, మెట్రో రైల్ ప్రాజెక్టు వంటివన్నీ వచ్చినట్లయితే ఆర్ధికంగా రాష్ట్రం కోలుకోగలదు. అప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమం నిరంతరం సజావుగా సాగేందుకు అవసరమయిన నిధులను, అందుకు అవసరమయిన ఒక ప్రత్యేక వ్యవస్థను శాశ్విత ప్రాతిపదికన ప్రభుత్వం ఏర్పాటుచేసుకోవడం మంచిది.
http://www.teluguone.com/news/content/ap-government-37-39047.html





