పెట్రోలుకు కర్నాటక.. మద్యానికి తెలంగాణ.. ఏపీకి ఆదాయం గుండు సున్న!
Publish Date:May 9, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ధరల బాదుడు పేదల నుంచి సంపన్నుల వరకూ అందరినీ బెంబేలెత్తిస్తున్నది. ఏ రాష్ట్రానికైనా ప్రధాన ఆదాయ వనరులు మద్యం, పెట్రోలు అమ్మకాలే.. ఆ రెంటి ద్వారా వచ్చే ఆదాయంలో ఏపీకి భారీగా గండి పడుతోంది. అంటే రాష్ట్రంలో మెజారిటీ జనం వాటి నినియోగానికి స్వస్తి చెప్పడం వల్ల కాదు.. ఆ రెంటినీ ఏపీలో కొనుగోలు చేయడం మానేసి పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నందు వల్ల. పెట్రోలు విషయం తీసుకుంటే.. పొరుగు రాష్ట్రమైన కర్నాటక కంటే ఏపీలో ధర ఎక్కువ. డీజిల్ దీ అదే దారి. ఇందుకు ఏపీ సర్కార్ వ్యాట్ తగ్గించకపోవడమే కారణం. దీంతో కర్నాటకలో పెట్రో ధరలు ఏపీతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. దీంతో కర్నాటక సరిహద్దు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం కర్నాటకకు వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుక్కుంటున్న పరిస్థితి ఉంది. దీని వల్ల ఏపీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఏపీ సర్కార్ పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించడం అటుంచి, అదనంగా రోడ్ సెస్ పేరిట ఒక రూపాయి వసూలు చేస్తుంది. ఇలా వసూలు చేయడం వల్ల అదనంగా ఆదాయం సమకూరుతుందన్నది సర్కార్ యోచన. అయతే అందుకు భిన్నంగా అసంతపురం వంటి జిల్లాల్లో పెట్రోలు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. పొరుగునే ఉన్న కర్నాటక నుంచే ప్రేవేటు బస్సులు, కార్లు, ఆఖరికి టూ వీలర్లకూ పెట్రలో కొనుక్కోవడం పరిపాటిగా మారింది. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, జిల్లాలోని పెట్రోలు బంకు యజమానులకూ భారీ నష్టాలను తెచ్చిపెడుతోంది. దీంతో జల్లాలో చాలా వరకూ పెట్రోలు బంకుల యజమానులు తమ పెట్రోలు బంకులను అమ్మకానికి పెట్టే పరిస్థితికి వచ్చారు. కర్నాటక- ఏపీ మధ్య తిరిగే ప్రైవేటు బస్సులు ఆంధ్రా పెట్రోల్, డీజిల్ వైపే చూడటం లేదు. దీంతో రోడ్ సెస్ ద్వారా అదనపు ఆదాయం వస్తుందనుకున్న ప్రభుత్వ అంచనా తప్పడమే కాకుండా ఆదాయానికి బారీ గండి పడింది. ఇక మద్యం విషయానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానమే అత్యంత విచిత్రంగా ఉందన్న విమర్శలు తొలి నుంచీ వినబడుతున్నాయి. బ్రాండెడ్ మద్యం ఏపీలో కాగడా వేసి వెతికినా కనిపించదు. చిత్ర విచిత్ర బ్రాండ్లను అనివార్యంగా అధిక ధరలకు కొనుక్కోవలసిన పరిస్థితి రాష్ట్రంలో మందు బాబులు ఎదుర్కొంటున్నారు. అదే పొరుగున ఉన్న తెలంగాణలో అయితే బ్రాండెడ్ మద్యం, నాణ్యమైన మద్యం ఇక్కడి కంటే అంటే ఏపీలో కంటే తక్కువ ధరకు లభిస్తోంది. దీంతో మందుబాబులు తెలంగాణకు క్యూకడుతున్నారు. ఎలా చూసినా ఏపీ కంటే తెలంగాణలో మద్యం రేట్లు 30 శాతం తక్కువ. అందుకే ఏపీలో మందుబాబులు తెలంగాణ మద్యం వైపే చూస్తున్నారు. అక్కడికి వెళ్లి తాగుతున్నారు. వీలైతే తెచ్చుకుని స్టోర్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి వల్ల కూడా ఏపీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ పరిస్థితి కొందరు అధికార పార్టీ నేతలకు మాత్రం కాసుల పంట పండిస్తోందని విమర్శలు కూడా వినవస్తున్నాయి. తెలంగాణ, గోవా తదితర ప్రాంతాల నుంచి అక్రమ మార్గంలో ఏపీకి మద్యం తరలించి వారు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో వారి అక్రమ మద్యం తరలింపు సాఫీగా సాగిపోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఏపీ విధానాల వల్ల రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న మద్యం, పెట్రోలు ద్వారా రావలసిన ఆదాయానికి బారీగా గండి పడుతోంది.
http://www.teluguone.com/news/content/ap-gets-huge-losses-due-to-liquor-25-135627.html





