అమరావతికి జగన్ గుడ్ న్యూస్
Publish Date:Feb 23, 2021
Advertisement
మూడు రాజధానులకు జై కొడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి మద్దతుగా మంత్రివర్గ సమావేశంలో కీలక అడుగు వేశారు. అమరావతిలో ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు నిధుల కోసం ఏఎం, ఆర్డీయేకు రూ. 3వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికీ ప్రారంభంకానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌లో అభిప్రాయం పడినట్లు సమాచారం. హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకినాడ ఎస్‌ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్‌ఈజెడ్ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది. వైఎస్సార్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా రూ.45వేలు అందించనున్నారు. కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇటీవల విశాఖ వెళ్లిన సీఎం జగన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/ap-cm-jagan-taken-good-desicion-on-amaravathi-25-110555.html





