మడమ తిప్పిన జగన్.. మద్య నిషేధానికి మంగళం!
Publish Date:May 31, 2021
Advertisement
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పే నినాదం.. వైసీపీ నేతల నోటి నుంచి వచ్చే పదం. మాట తప్పం.. మడమ తిప్పనంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. రెండేండ్లుగా మాట తప్పుతూనే ఉన్నారు. మడమ తిప్పితూనే ఉన్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. రాష్ట్ర మద్యం పాలసీలో గొప్ప మార్పును ప్రకటించారు జగన్ రెడ్డి. చడీ చప్పుడు లేకుండా, అంచల వారీ మద్య నిషేధం వాగ్దానానికి మంగళంపాడేశారు. రెండేళ్ళ పాలనపై విడుదల చేసిన 16పేజీల పత్రంలో, మధ్య ‘నిషేధం’ (ప్రొహిబిషన్) పదాన్ని తుడిచేసి, దాని స్థానంలో మధ్య ‘నియంత్రణ’ ( రిస్ట్రిక్షన్స్) అనే పదాన్ని చేర్చారు. “తాగుడు దురలవాటు కారణంగా చితికిపోతున్న కుటుంబాలను కాపాడేందుకు,ప్రభుత్వం అంచల వారీగా మధ్య ‘నియంత్రణ’ అమలు చేస్తుంది” అని ముఖ్యమత్రి ప్రకటించారు. రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అంచెల వారీగా సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని వాగ్దానం చేశారు. సంపూర్ణ మధ్య నిషేధం లక్ష్యంగా నూతన మద్య పాలసీ ప్రకటించారు. అందులో భాగంగా మద్యం అమ్మకాలను తగ్గించడం కోసమంటూ, వ్యాపారాన్ని, ప్రభుత్వ పరం చేశారు. అలాగే, మద్యం షాపుల సంఖ్యను, గడచిన రెండు సంవత్సరాలలో 4,380 నుంచి 2,934 కు తగ్గించామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే, మద్యం షాపుల సంఖ్య తగ్గినా,మద్యంపై వచ్చే ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలో ఇంకెక్కడా లేని చిత్ర విచిత్ర బ్రాండ్స్ తెచ్చి, ధరలు పెంచి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటోంది అన్న విమర్శ చాలా బలంగా వినిపిస్తోంది. అలాగే మదయం తయారీ వ్యాపారం పూర్తిగా వైసీపీ నాయకులు, సానుభూతి పరుల చేతుల్లో ఉందని కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే సంపూర్ణ మద్య నిషేధం విషయంలో నిబద్ధతో ఉన్నామంటున్న ప్రభుత్వం, మద్య నిషేధం పదాన్ని తొలిగించి మద్య నియంత్రణ అనే పదం ఎందుకు చేర్చింది? ఈమార్పు ఉద్దేసపూర్వకంగా జరిగిందా లేక పొరపాటు దొర్లిందా, అంటే అధికారులు ఉద్దేసపూర్వకంగానే మార్పు జరిగిందని అంటున్నారు. మద్యం ఆదాయాన్ని ఏస్కో రెవిన్యూగా చూపింఛి ప్రభుత్వం వివిధ బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు ఋణం తీసుకుంది. ఈ కారణంగానే మద్యం పాలసీలో నిషేధం తొలిగి నియంత్రణ వచ్చిందని అధికార వర్గాల సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ, వివిధ పథకాల అమలుకు సుమారు రూ.16000 కోట్లు ఋణం సేకరించాలని నిర్ణయించింది, ఈ విషయాన్ని బడ్జెట్ లో కూడా చూపించారు. ఇందుకు కూడా మద్యం ఆదాయమే (ఏస్కో రెవిన్యూ) ఆధారం. ఓ వంక సంపూర్ణ మద్య నిషేధం అంటూనే ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని పెంచుకోచూస్తోంది అనేందుకు ఇంతకంటే వేరే సాక్ష్యం ఆక్కరలేదని అంటున్నారు. మద్యం అమ్మకాల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.17,600 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ముందు సంవత్సరంలో కూడా అంతే ఆదాయం వచ్చింది. రెండు సంవత్సరాలలో ప్రభుత్వం మద్యం ధరలను 125 శాతం పెంచింది. ఈ పరిణామాలను గమనిస్తే సంపూర్ణ మద్య నిషేధం ... సంపూర్ణ అసత్యం.. జగన్ మాట తప్పింది.. మడమ తిప్పింది వాస్తవం..
http://www.teluguone.com/news/content/ap-cm-jagan-changed-his-policy-on-prohibition-of-alcohol-25-116650.html





