నన్ను ఎవరూ ఏం చేయలేరు - సీఎం
Publish Date:Jan 25, 2019
Advertisement
ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అక్కలు, చెల్లెళ్లు అండగా ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నేలపాడులో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాలను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు తెలిపారు. 23 ఏళ్లలో 93లక్షల మంది డ్వాక్రా సభ్యులయ్యారని, నాలుగున్నరేళ్లలో పసుపు-కుంకుమ కింద రూ.21,116 కోట్లు అందజేశామని చెప్పారు.రాబోయే రెండు నెలల్లో ఒక్కో డ్వాక్రా మహిళ బ్యాంకు ఖాతాలో రూ.10వేలు చొప్పున జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
మూడు విడతలుగా చెక్కుల రూపంలో వాటిని అందజేస్తామన్నారు. దీనికోసం మొత్తం రూ.9,400 కోట్లు ఇస్తున్నామని.. వడ్డీమాఫీ కోసం రూ.11,118 కోట్లు చెల్లించామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని మొత్తం కోటీ 40 లక్షల మంది మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని బాబు ప్రకటించారు. ప్రతి మహిళా ఓ పారిశ్రామికవేత్తగా తయారు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రకృతి సేద్యం పెరగాలని, ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ప్రపంచానికి ప్రకృతి సేద్యం అనే బహుమానాన్ని మన రాష్ట్రమే ఇవ్వాలని చెప్పారు. మహిళల ఆరోగ్యంపై త్వరలో హెల్త్ కార్డులు కూడా రూపొందిస్తామని వెల్లడించారు. 'పిల్లలను కనండి.. కనీసం ఒకరినైనా కనండి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జననాల సంఖ్య తక్కువగా ఉందని, ఇద్దరు కాదు.. నలుగురిని కన్నా ఫర్వాలేదని ఆయన అన్నారు. మన దేశ విశిష్ట గౌరవం కుటుంబ వ్యవస్థని అన్నారు.
http://www.teluguone.com/news/content/ap-cm-chandrababu-naidu-at-dwcra-groups-meeting-in-guntur-39-85512.html





